ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓటర్లు కోలుకోలేని దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. వైకాపా పాలనతో విసిగిపోయిన ఆంధ్రులు కూటమి వైపు మొగ్గు చూపి ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. మళ్లీ చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి బాధ్యత కట్టబెట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి జగన్ పాలనపై చురకలు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తాజాగా ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభకు హాజరైన కీరవాణి రామోజీరావు గారిని గుర్తు చేసుకునే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `గతంలో ఓ సభలో బ్రతికితే రామోజీరావులా బతకాలని అన్నాను. ఇప్పుడు మరణించినా కూడా ఆయనలానే మరణించాలని అంటున్నాను. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు మృత్యువు అంచుల్లో ఉన్నా ఉత్తరాయణం వచ్చేంతవరకు తన మరణాన్ని వాయిదా వేశాడు.
అదేవిధంగా రామోజీరావు కూడా తాను ఎంతో ప్రేమించే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కబంద హస్తాల్లోంచి కళ్లారా చూసిన తర్వాతే నిష్క్రమించారు` అంటూ కీరవేణి పరోక్షంగా జగన్ పాలనపై గట్టి చురకలు వేశారు. అలాగే రామోజీరావుపై బురదజల్లడమంటే.. నడినెత్తిపై ఉన్న సూర్యుడిపై రాయి వేయడమేనని కీరవాణి వ్యాఖ్యానించారు. అయితే వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడూ దూరంగా ఉండే కీరవాణి.. ఇప్పుడు జగన్ ను టార్గెట్ చేసి ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం ఆసక్తికరంగా మారింది.