ఏపీలో ఈ ఏడాది మార్చిలో ఎండాకాలం వేడితో పాటు ఎన్నికల వేడీ పోటీ పడబోతోంది. ఇప్పటికే ఫిబ్రవరి చలిలోనూ పంచాయతీ ఎన్నికలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఫిబ్రవరి 21న పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం కానున్న సంగతి తెలిసిందే. మార్చిన 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా…మార్చి 14న ఫలితాలు విడుదల కానున్నాయి.
ఆ తర్వాత వెంటనే మార్చి నెలలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మార్చి నెలలో ఎన్నికల వేడిని మరింత రాజేసేలా ఏపీలో మరో ఎన్నికలకు నగారా మోగింది. ఏపీలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 25న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా…మార్చి 4 నామినేషన్లకు ఆఖరు తేదీ అని ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8వ తేదీ వరకు గడువు ఉంది. మార్చి 15న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అదే రోజున కౌంటింగ్ నిర్వహించబోతున్నారు.
మార్చి 29తో నలుగురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగిసింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో ఒక స్థానం ఖాళీ కాగా…చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. తిప్పేస్వామి, సంధ్యారాణి, వెంకటచౌదరి, షేక్ అహ్మద్ ల పదవీ కాలం ముగియనుండడంతో వారి స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ రకంగా వరుస ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల లాంగ్ ‘మార్చి’ కొనసాగనుంది.
కాగా, అటు తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పదవీ కాలం కూడా మార్చి 29తో ముగియనుంది. దీంతో, తెలంగాణలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17(బుధవారం) ఓట్ల లెక్కింపు ఉంటుంది.