ప్రభుత్వ ఉద్యోగి ముఖంలో చిరునవ్వు కనిపిస్తేనే వారు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు…ఆనాడు ప్రతిపక్ష నేత జగన్ అన్న మాట ఇది. కట్ చేస్తే…పదో తారీకు దాటినా సరే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ముఖంలో చిరునవ్వు కాదు..ఏడుపు ఒక్కటే తక్కువ అన్న పరిస్థితి ఉంది. దీంతో, జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు…రెట్టించిన నిరుత్సాహంతో పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. జగన్ దయ వల్ల గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయిన తమకు కూడా ‘‘అమ్మో ఒకటో తారీకు’’ సినిమా కనిపిస్తోందని వారు వాపోతున్నారు. గతంలో ఒకటో తారీకున పడే జీతాలు, పెన్షన్లు… జగన్ హయాంలో కుదిరితే ఐదో తారీకు…లేదంటే పదో తారీకు అన్న చందంగా తయారైందని విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శలు గుప్పించారు. 11వ తారీకు వచ్చినా 40 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, 60 శాతం మంది పెన్షన్ దారులకు పెన్షన్లు పడలేదని అశోక్ ఆరోపించారు. జీతాల వివరాలను ఆర్థికశాఖ వెల్లడించడం లేదని అన్నారు. ప్రతి నెలా రూ. 5,500 కోట్ల వరకు చెల్లిస్తున్నామని, నిన్నటి వరకు రూ. 2,500 కోట్లు చెల్లించామని ఆర్థిక శాఖ తెలిపిందని చెప్పారు. అంటే ఇంకా సగానికిపైగా చెల్లించాల్సి ఉందన్న సంగతి వారే అంగీకరించారని చెప్పారు. ఈ వివరాలపై సీఎం జగన్ ఏం చెపుతారని ప్రశ్నించారు.
నెల జీతాలు, పెన్షన్లపై బతికేవారి గురించి జగన్ ఆలోచించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆగ్రహాగ్నిపర్వతం బద్దలై ఆ లావా జగన్ ప్రభుత్వాన్ని దహించి వేయడం ఖాయమని జోస్యం చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను పక్కన పెట్టి ఎన్నికలకు వెళ్లినా తనకు తిరుగుండదని అనుకోవడం జగన్ మూర్ఖత్వమని విమర్శించారు. 13 లక్షల పైచిలుకు ఉద్యోగుల్లో నీలి రక్తం నిండిన వారు లక్ష 30 వేల మంది మాత్రమే అని, 12 లక్షల మంది జగన్ ప్రభుత్వానికి బొక్క పెట్టడం ఖాయమని సంచలన విమర్శలు చేశారు.