నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఫామ్ హౌస్ లో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన వైనం దేశ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించిన వైనం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్…ఆ నలుగురు ఎమ్మెల్యేలను డబ్బు, పదవులతో ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఆ ముగ్గురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తమను అక్రమంగా అరెస్టు చేశారని, హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని వారు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీంతో, నిందితులు నేరుగా తమ ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నవంబర్ 4న ఆ పిటిషన్ పై విచారణ చేపట్టబోతున్నట్టుగా ప్రకటించింది.
మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ వేదికగా ఈ ముగ్గురు నిందితులు….టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, వీరి రిమాండ్ ను ఏసీబీ కోర్ట్ తిరస్కరించింది. దీంతో, పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో హైకోర్టు ఆదేశాలతో నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు బెయిల్ మంజూరు చేయాలంటూ సోమవారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.