ఆయన వయసు 58. పెద్దగా చదువుకోలేదు. ప్రజాసేవలో ఉన్న ఆయనకు జనం మెచ్చి ఓట్లు వేసి ఎమ్మెల్యేను చేశారు. అయినప్పటికీ.. ఆయనలో మాత్రం తాను పెద్దగా చదువుకోలేదన్న ఫీలింగ్ మాత్రం ఉంది. అందుకేనేమో.. ఎప్పటి నుంచో మనసులో ఉన్న కోరికను తాజాగా ఆయన తీర్చేసుకుంటున్నారు.
పదో తరగతి పరీక్షకు హాజరు కావటంతో ఆ ఎమ్మెల్యే ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు.. మరో పెద్ద ట్విస్టు కూడా ఉంది. ఇదంతా తెలిసిన తర్వాత వావ్ అనకుండా ఉండలేరు.
ఒడిశాకు చెందిన అధికార బీజేడీకి చెందిన ఎమ్మెల్యే అంగద కన్హార్.. శుక్రవారం నుంచి మొదలై పదో తరగతి పరీక్షకు హాజరై అందరిని ఆకర్షించారు. పెద్ద వయసులో పదో తరగతి పాస్ అన్న క్వాలిఫికేషన్ కోసం ఆయన పడుతున్న ఆత్రుత అందరిని ఆకట్టుకుంటోంది.
1978లో పదో తరగతి వరకు వెళ్లినా.. అప్పట్లోఎదురైన సమస్యల కారణంగా పరీక్షలు మాత్రం రాయలేకపోయారు. కట్ చేస్తే.. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ పుస్తకం పట్టింది లేదు.
అందుకే తన మనసులో ఉన్న భావాన్ని బయటపెట్టేందుకు ఆయన అస్సలు బిడయపడలేదు. చదువుకుంటే పెరిగేది జ్ఞానమే కదా? అందులో సిగ్గుపడాల్సిన అవసరం ఎందుకు? అంటూ తేల్చేసిన ఆయన.. మొదటి పరీక్షగా ఇంగ్లిషు టెస్టు పూర్తి చేశారు. ట్విస్టు ఏమంటే.. ఆయనతో పాటు ఆయన చిన్ననాటి స్నేహితులు కూడా పదో తరగతి పరీక్ష రాయటం. అలా రాసిన వారిలో ఒకాయన సర్పంచ్ కూడా.
వివిధ కారణాలతో స్కూలింగ్ ను మధ్యలో ఆపేసి.. బతుకు పోరాటంలో చదువు గురించి పట్టించుకోని ఈ పెద్దాళ్లు ఇప్పుడు పదో తరగతి పరీక్షరాసేందుకు ఎగ్జామ్ సెంటర్ కు రావటం అందరిని ఆకట్టుకోవటమే కాదు.. చదువుకు వయసుకు ఏ మాత్రం సంబంధం లేదన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. ఏమైనా.. చదువు లేని నేతలు.. తమ విద్యార్హతను పెంచుకోవటానికి ప్రయత్నిస్తే అది స్ఫూర్తి వంతంగా నిలవటమే కాదు.. చదువు మీద మరింత ఆసక్తిని పెంచేలా చేస్తుందని చెప్పక తప్పదు.