మైలవరం అసెంబ్లీ టికెట్ వ్యవహారం గత కొద్దిరోజులుగా వార్తలలో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని, దాదాపుగా ఆయన చేరిక ఖాయమైందన్న సంగతి తెలిసిందే. అయితే, మైలవరం టికెట్ చంద్రబాబు కన్ఫామ్ చేసిన తర్వాతే వసంత పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరోవైపు, తాను కూడా మైలవరం నుంచి పోటీ చేస్తానని గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయిన దేవినేని ఉమా చంద్రబాబుతో చర్చలు జరిపారు.
ఈ నేపథ్యంలో ఉమ, వసంత కృష్ణ ప్రసాద్ ల మధ్య టికెట్ కోసం పోటీ ఏర్పడింది. ఆ టికెట్ పంచాయతీ తెగక ముందే తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరారు. ఆయనకు టిడిపి కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన కృష్ణ ప్రసాద్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నేతలతో పాటు జగన్ పై సంచలన విమర్శలు చేశారు.
అమరావతి రాజధాని అని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్ ఆ తర్వాత మాట మార్చారని, అది కేవలం జగన్ కే చెల్లిందని వసంత ఆరోపించారు. ఇక, ప్రతిపక్ష నేతలను తిట్టిన వారికే వైసీపీలో పదవులు దక్కుతాయని వసంత ఆరోపించారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని జగన్ చెప్పారని, కానీ చంద్రబాబును, లోకేష్ ను తిడుతూ ఉండాలని సూచించారని వసంత షాకింగ్ ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేతలను తిట్టే నేతలకే వైసీపీలో టికెట్లు ఉంటాయని ఆరోపించారు.
ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీలో ఉండలేక టిడిపిలో చేరానని చెప్పుకొచ్చారు. అయితే, దేవినేని ఉమతో వ్యక్తిగతంగా తనకు ఎటువంటి ద్వేషాలు లేవని, టిడిపి పెద్దల సమక్షంలో ఇరువురం కూర్చొని మాట్లాడుకుంటామని వసంత తెలిపారు. అయితే, మైలవరం టికెట్ ను వసంత కృష్ణ ప్రసాద్ కి కేటాయించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.