చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి పేరు పెద్దగా వార్తల్లో వినిపించిన దాఖలాలు లేవు. రాజకీయ వ్యవహారాలలో తన భర్తకు చేదోడువాదోడుగా ఆమె ఉంటున్నప్పటికీ పెద్దగా మీడియా ముందుకు రాలేదు. అయితే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సవాల్ విసిరిన తర్వాత ఆమె పేరు రాష్ట్ర రాజకీయాలలో మార్మోగిపోతోంది. నాని తరఫున తాను 50 లక్షలు లంచం తీసుకున్నానని ఆరోపించిన చెవిరెడ్డికి సుధారెడ్డి సవాల్ విసిరారు. ఆ ఆరోపణలను నిరూపించాలని, బహిరంగ చర్చకు రావాలని, లేకుంటే చెవిరెడ్డి ఇంటికి వస్తానని ఆమె చేసిన ఛాలెంజ్ సంచలనం రేపింది.
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిరూపించాలంటూ చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గరకు వచ్చి సుధారెడ్డి ఛాలెంజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీడియా ముందు లైవ్ లో చెవిరెడ్డికి సుధారెడ్డి ఫోన్ చేశారు. అయితే, పలుమార్లు ఫోన్ చేసినా చెవిరెడ్డి లిఫ్ట్ చేయలేదు.
”ఎమ్మెల్యే నానిని ఢీకొట్టలేక నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? నేను లంచం తీసుకున్నట్లు నాపై అభియోగం వేశారు. చెవిరెడ్డి తన అఫీషియల్ పేజీలో, వైసీపీ పేజీలో నా గురించి పోస్ట్ పెట్టారు. ఎమ్మెల్యే భార్య అని రాశారు. ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే భార్య స్పష్టంగా రాయండి. నాపై చేసిన ఆరోపణలకు మీరు రుజువులు తీసుకుని రావాలని చెప్పాను. కానీ, మీరు రాలేదు. నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తడం లేదు” అంటూ చెవిరెడ్డిపై సుధారెడ్డి నిప్పులు చెరిగారు. ఏది ఏమైనా చెవిరెడ్డికి చెమటలు పట్టించిన పులివర్తి సుధా రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.