ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజ యంతోపాటు.. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా.. మూడు రాజధానుల ఏర్పాటు.. నేపథ్యంలో ఈ మార్పులకు ప్రాధాన్యం చోటుచేసుకుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్ తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి కూడా ఇక్కడ ఆయనకు అన్ని విధాలా సహకారంగా ఉన్న నాయకుడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.
ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ నుంచి గోశాల నిర్వహణ.. వరకు అన్ని విషయాలను ఆయనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు. అదేసమయంలో తాడేపల్లిలో నిర్మాణాలను కూడా ఆయన ఆధ్వర్యంలో నే చేపడుతున్నట్టు కొన్నాళ్లుగా వైసీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాను ఎలానూ.. విశాఖకు మకాం మార్చేస్తానని.. సీఎం జగన్ చెబుతున్న నేపథ్యంలో విశాఖలోనూ ఏర్పాట్లు చూసేందుకు.. భూముల నిర్వహణ, సేకరణ వంటి కీలక విషయాల్లోనూ.. చెవిరెడ్డిని తీసుకువెళ్తారని అంటున్నారు.
ఇక, ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోటీకి పెడతారని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వాస్తవానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి వరుసగా విజయాలు దక్కించుకుంటున్నారు చెవిరెడ్డి. ఆయనకు పెద్దగా వ్యతిరేకత కూడా లేదు. ఏదైనా భారీ తేడా వస్తేనో.. టీడీపీ నుంచి బలమైన అభ్యర్థి నిలబడితేనో తప్ప..చెవిరెడ్డి గెలుపునకు ఎలాంటి ఇబ్బందీ లేదు.
అయినప్పటికీ..చెవిరెడ్డిని విశాఖకుపంపుతున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోందంటే.. దీని వెనుక.. సీఎం జగన్ నివాసం.. ఆయన అవసరాల కోసమే చెవిరెడ్డిని విశాఖకు బదిలీ చేస్తున్నారని అంటున్నారు. ఇక, చంద్రగిరి నియోజకవర్గాన్ని మంత్రి రోజాతో భర్తీ చేస్తారని మరో టాక్ నడుస్తోంది. ఈ మె కూడా.. వ రుసగా విజయాలు దక్కించుకుంటున్నారు. 2014, 2019ఎన్నికల్లో రోజా చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
ఇక, ఈ నియోజకవర్గంలో రోజాపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నట్టు వైసీపీ గుర్తించిందని.. ఆ పార్టీ నేతల్లోనే చర్చ సాగుతోంది. పైగా.. ఈ నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు గా ఉన్న కేజే కుమార్ సతీమణికి కేటాయించాలనే వత్తిళ్లు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలతో రోజాను చంద్రగిరికి పంపించి.. ఇక్కడి చెవిరెడ్డిని విశాఖకు పంపుతారని.. దీంతో అన్ని విషయాల్లోనూ సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు అవుతుందని.. అధినేత భావిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.