ఏపీ అధికార పార్టీ తీరుతో అధికారులు అనేక వర్గాలుగా విడిపోయి అల్లకల్లోలం అయిపోయారు. ఒకవైపు రాజకీయ ఒత్తిడి, మరోవైపు అధికారాల్లో కోత, ఉద్యోగ సంఘాల రాజకీయ కార్యకలాపాలు ఉద్యోగులను తీవ్ర కలతకు గురిచేస్తున్నాయి.
ఇదిలా ఉండగా… తాజాగా ఒక వైసీపీ ఎమ్మెల్యే అధికారులు తనకు అసలు సహకరించడం లేదంటూ గత కొద్దికాలంగా విమర్శలు చేస్తున్నారు. ఆయనే ఆనం రామనారాయణ రెడ్డి. దానికి కారణం ఏంటో తెలుసా… ఆయన్ను కనీసం రిపబ్లిక్ వేడుకలకు కూడా అధికారులు పిలవలేదట.
నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేను ఓడించి గెలిచిన ఎమ్మెల్యే ఆనం ఆనం రామనారాయణ రెడ్డికి ప్రోటోకాల్ విషయంలో అధికారులు అవమానించడం ఘోరం.
జిల్లాలో అధికారులు కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని.. ఎమ్మెల్యేగా తమకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అర్హత లేదా అని ప్రశ్నించారు. అధికారులు ఎవరైనా చెబితే విస్మరించారా..? లేదా వారు కావాలనే నిర్లక్ష్యం చేశారో నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. నాకు అడగడానికే సిగ్గుగా ఉందన్నారు.
జిల్లా అధికారులను అడిగితే ఎన్నికల కోడ్ నిబంధనలు అని చెబుతున్నారని.. అలాంటి నిబంధనలు లేవని ఈసీ చెప్పినప్పటికీ.. ఈ విధంగా చేయడాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని, లీగల్ ఫైట్ చేస్తానని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
ఇటీవలే నగరి ఎమ్మెల్యే రోజా సైతం ప్రోటోకాల్ విషయంలో బాగా హర్టయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో తనను భాగస్వామిని చేయడం లేదంటూ ఆవేదన చెందారు. అంతకుముందు ఉన్నతాధికారులపై నల్లపురెడ్డి ఫైరయ్యారు. మొత్తం గ్రేటర్ రాయలసీమలో వైసీపీలో చాలా రచ్చ జరుగుతోంది. మరి ఈ విషయంపై వైసీపీ అధిష్ఠానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.