మహిళలు, యువతులు, చిన్నారుల విషయంలో రోజుకో రీతిగా వెలుగులోకి వస్తున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వాలు అనేక చట్టాలు చేస్తున్నాయి. అయినప్పటికీ దేశంలో మహిళల విషయంలో లైంగిక వేధింపులు ఆగడం లేదు. ఇక, ప్రభుత్వంలో కీలక పొజిషన్ అయిన మంత్రి పోస్టులో ఉన్న మహిళా నాయకురాలికే లైంగిక(సెక్స్) వేధింపులు ఎదురైతే.. ఇక, ఎవరికి చెప్పుకోవాలి?! కంచే చేసిన మేసిన చందంగా మారిన ఈ ఘటన ఏపీకి పక్కనే ఉన్న పుదుచ్చేరి(కేంద్ర పాలిత రాష్ట్రం)లో చోటు చేసుకుంది.
మహిళా మంత్రికి ఏకంగా ఇటు సెక్సువల్‌గా, అటు కులం పరంగానూ వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె విసిగిపోయి.. తన సమస్యకు పరిష్కారం లభించదని భావించి.. చివరకు తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.
ఎవరు? ఏం జరిగింది?
పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ పార్టికే చెందిన చంద్ర ప్రియాంక రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. పుదుచ్చేరి ఏర్పడిన 40 ఏళ్ల తర్వాత మహిళకు మంత్రివర్గంలో స్థానం లభించడం గమనార్హం. విధుల విషయంలో నిబద్ధతతో వ్యవహరిస్తారనే పేరు కూడా ఉంది. అదేసమయం లో ప్రజా సేవలోనూ ఆమెకు పలు అవార్డులు వచ్చాయి. అటువంటి మంత్రి అనూహ్యంగా మంగళవారం తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. దీనికి ఆ రోజు ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అనంతరం.. బుధవారం ఆమె బహిరంగ లేఖ రాశారు. అది కూడా ప్రజలకే కావడం గమనార్హం.
‘అణగారిన వర్గానికి చెందిన నేను కులపరంగా, లైంగికపరంగా వేధింపులకు గురయ్యాను. ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ మంత్రిగా కొనసాగలేను’ అని చంద్ర ప్రియాంక లేఖలో పేర్కొన్నారు. ఇది.. పుదుచ్చేరి సర్కారుకు భూకంపం వంటి పరిణామంగా మారిపోయింది. దీంతో హుటాహుటిన ఉన్నతాధికారులతో భేటీ అయిన సీఎం ఆమెను ఇలా ఇబ్బంది పెట్టింది ఎవరన్న దానిపై చర్చించారు. బాధ్యులు ఎవరో 24 గంటల్లో గుర్తించాలని ఆయన ఆదేశించినట్టు సమాచారం.