1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఈ గవర్నెన్స్ ను ప్రభుత్వ కార్యాలయాలకు పరిచయం చేశారు. అప్పటి దాకా ఫైళ్లు, లెడ్జర్ లతో కుస్తీలు పట్టిన ప్రభుత్వ ఉద్యోగులతో కీబోర్డ్, మౌస్ పట్టించి సరికొత్త శకానికి నాంది పలికారు. కట్ చేస్తే తాజాగా ఆయన తనయుడు నారా లోకేశ్ ఐటీ శాఖా మంత్రిగా మరో అడుగు ముందుకు వేసి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’ ద్వారా 161 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
రాష్ట్రంలో పౌరులకు మరింత సులభంగా సేవలందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తెచ్చామని ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ముందుగా రెవెన్యూ, దేవాదాయ శాఖ, సీఎంఆర్ఎఫ్..తదితర 161 సేవలను “మన మిత్ర” ద్వారా అందుబాటులోకి తెచ్చామని అన్నారు. రెండో దశలో 300 పైగా పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. వాట్సాప్ నంబర్ 95523 00009ను ఇందుకోసం కేటాయించామని, దీని ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందించనున్నామని తెలిపారు.
పరిపాలనా సంస్కరణల్లో ఇది ఒక చారిత్రాత్మక రోజు అని, “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి ఈ సేవలు అందిస్తున్నామని చెప్పారు. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నామని అన్నారు. యువగళం పాదయాత్రలో నే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన వచ్చిందని, బటన్ నొక్కితే భోజనం, సినిమా వచ్చినపుడు.. పాలన ఎందుకు రాకూడదు..? అని ఆలోచించానని చెప్పారు. ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలనేది తమ ఉద్దేశం అన్నారు.