విశాఖలో జనసైనికులు వర్సెస్ వైసీపీ నేతలు అన్న రీతిలో వార్ జరిగిన సంగతి తెలిసిందే. విశాఖ గర్జనకు వైసీపీ నేతలు ముందు నుంచి పరోక్షంగా మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయేతర జేఏసీ అంటూ కలరింగ్ ఇచ్చినప్పటికీ…ఆ గర్జనలో పాల్గొనేది వైసీపీ నేతలన్నది ప్రజలందరికీ తెలిసిందే. అయితే, గర్జనకు అనుకున్నంత స్పందన రాకపోవడంతో మంత్రులు రోజా, జోగి రమేశ్ తదితరులు స్వయంగా రంగంలోకి దిగారు. అయినా సరే, విశాఖలో పవన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు గర్జించలేకపోయారు.
దీంతో, జనసేన కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టి వేధింపులకు దిగారన్న ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా…విశాఖ గర్జన్ ఫ్లాప్ కావడం, అదే సమయంలో పవన్ హోటల్ రూంలో ఉన్నా…జనసేనకు విపరీతమైన మద్దతు రావడం వంటి విషయాలను వైసీపీ అధినాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలపై వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే జనసైనికులపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన కార్యకర్తలు తోకలేని కోతులని కారుమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ఈ తోకలేని కోతులు వాహనం నుంచి కింద పడేశాయని అన్నారు. విశాఖ గర్జన సమయంలో పవన్ నగరానికి రావాల్సిన అవసరం ఏముందని కారుమూరి ప్రశ్నించారు. విశాఖ గర్జన కార్యక్రమం ముందే నిర్ణయించామని, గొడవలు జరిగే అవకాశం ఉందని తెలిసినా పవన్ పర్యటన వాయిదా వేసుకోకుండా వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ విమానాశ్రయం వద్ద కర్రలు, రాడ్లతో మంత్రుల కార్లపై దుర్మార్గంగా దాడిచేశారని అన్నారు. ఈ దాడిలో మంత్రి రోజా తలపగిలి ఉండేదని, తృటిలో తమ నేతలకు పెను ప్రమాదం తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, కారుమూరి కామెంట్లకు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. బలవంతుడైన రావణాసురుడిని ఢీకొట్టిన వానర సైన్యం లంకా దహనం చేసిన మాదిరిగానే…తాడేపల్లి ప్యాలెస్ లో కనకపు సింహాసనంపై కూర్చొని ఉన్న జగన్ ను ఈ జనసేన సైన్యం గద్దె దించుతుందని హెచ్చరిస్తున్నారు. జనసైనికులు కోతులైతే…తాడేపల్లి దహనం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.