నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన సాక్ష్యాల ఫైల్ దొంగతనం ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత నెల్లూరు ఎస్పీ విజయరావు చెప్పిన వివరాలు వైరల్ అయ్యాయి. ఆ ఫైలు దొంగిలించింది ఇద్దరు పాత నేరస్తులని, కోర్టులో ఇనుము దొంగతనం చేయడానికి వెళ్లి కుక్కలు అరవడంతో కోర్టులోపలికెళ్లి ఓ బ్లూ కలర్ బ్యాగ్ కొట్టేశారని చెప్పారు.
ఇక, ఎస్పీ ఇచ్చిన వివరణపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఐరన్ దొంగలు – కుక్కలు – బ్యాగు… కధ బలే ఉంది కదా ’’అంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. కోర్టులో ఎన్నో ఫైల్స్ ఉండగా కాకాణికి సంబంధించిన ఫైలు మాత్రమే ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యవహారంపై మంత్రి కాకాణి స్పందించారు. ఆ చోరీతో తనకెలాంటి సంబంధం లేదని, ఈ కేసులో హైకోర్టు విచారణకూ లేదా సీబీఐ విచారణకు సిద్ధమని అన్నారు.
ప్రభుత్వంలో తాను భాగస్వామి అయినందున ప్రభుత్వ విచారణ కూడా జరిపించుకోవచ్చని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పార్టీ పరంగా తనకు ఎవరితోనూ బేదాభిప్రాయాలు లేవని, అందరం కలిసి పని చేస్తామని చెప్పారు. మంత్రి అనిల్ తో కాకాణికి పడడం లేదన్న ప్రచారం నేపథ్యంలో కాకాణి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఇక, ఈ వ్యవహారంపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా స్పందించారు. ఈ కేసులో సాక్ష్యాల ఆధారంగానే ముందుకు వెళ్లామని, విచారణలో అసలు వాస్తవాలు బయటపడతాయని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని సమన్లు జారీ చేశామన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిన్నారి మృతి ఘటన బాధాకరమని, పాపను తీసుకెళ్లే సమయానికి మంత్రి ఉషాశ్రీ చరణ్ ర్యాలీకి గంట సమయం తేడా ఉందని డీజీపీ తెలిపారు.