ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తాజాగా వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లు వైసీపీ నాయకులు చాలా దారుణాలు చేశారని.. తప్పు చేసినవారు ఎవ్వరైనా సరే, ఎంతటి హోదాలో ఉన్నా వదిలేదే లేదని మంత్రి డోలా అన్నారు. ఈ రోజు ప్రకాశం జిల్లాలో మీడియాతో సమావేశం అయిన మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడిచింది. విలువల మరచి ఎవరిపై కక్ష సాధింపులు సాధించలేదు. వైసీపీ హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి. ఈనాడు మూగబోయిన గొంతులు మళ్లీ ఇప్పుడు తెరుచుకుంటున్నాయని మంత్రి డోలా అన్నారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని, ఎంతటి వారైనా తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. అందుకు నిదర్శనం రిటైర్డ్ సీఐడీ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్టే అని గుర్తు చేశారు.
ఇక అదానీ సంస్థతో గత వైసీపీ సర్కార్ కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వ్యవహారంపై కూడా మంత్రి డోలా స్పందించారు. సెకి తో విద్యుత్ ఒప్పిందాల విషయంలో స్కామ్ జరిగిందని.. ఇది అందరికీ తెలిసిపోవడంతో నష్టనివారణ కోసం వైసీపీ నాయకులు ఏమీ ఎరుగనట్లు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారంటూ మంత్రి డోలా ఎద్దేవా చేశారు.