సీఎం జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నానాటికి పెరిగిపోతోందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని టిడిపి అధినేత చంద్రబాబు సహా ప్రతిపక్ష నేతలంతా ముక్తకంఠంతో చెబుతున్న సంగతి తెలిసిందే. జనాల్లో జగన్ పై ఉన్న వ్యతిరేకత పెరిగిపోయిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే వైసిపి ఓటమి ఖాయమని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక, రాబోయే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలుస్తానంటూ గొప్పలు చెబుతున్న ముఖ్య మంత్రి జగన్ పులివెందులలో కూడా గెలవలేరని చంద్రబాబు ఎద్దేవా కూడా చేశారు.
రాబోయే ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ జైలుకు, వైసిపి బంగాళాఖాతానికి వెళ్లాల్సిందేనని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత గురించి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ధర్మాన అంగీకరించడం షాకింగ్ గా మారింది. అయితే, సంస్కరణలను ప్రజలు అర్థం చేసుకోకపోవడంవల్లే ఈ వ్యతిరేకత ఏర్పడిందని ధర్మాన చెప్పారు.
సంస్కరణలు చేసే వారిపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని ధర్మాన అన్నారు. నూతన సంస్కరణలు చేసే సమయంలో ఫలితాలు ముందుగా రావని చెప్పారు. అందుకే, సంస్కరణలకు ప్రజల నుంచి ఆమోదం త్వరగా లభించదని చెప్పుకొచ్చారు. ప్రజలకు మేలు జరిగేందుకు చేపట్టిన సంస్కరణలపై తొలుత వ్యతిరేకత వస్తుందని జగన్ కు తెలుసని, అయినా సరే సంస్కరణల బాట పట్టి ఆయన ముందుకు వెళ్తున్నారని ధర్మాన కితాబిచ్చారు. ఏది ఏమైనా తమ సొంత ప్రభుత్వంపై ధర్మాన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.