మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అధికారులే షాక్ ఇస్తున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనించిన తర్వాత ఎవరైనా అవుననే అనక తప్పదు. ఇంతకీ విషయం ఏమిటంటే ఒంగోలు నియోజకవర్గంతో పాటు ఒంగోలు మున్సిపాలిటిలో మంచినీటి కొరత ఇప్పటిది కాదు. దశాబ్దాల పాటు మంచినీటి కొరత జనాలను బాగా ఇబ్బందులు పెట్టేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో మంచినీటి సమస్యనే ప్రదానంగా హైలైట్ చేసిన బాలినేని మంచి మెజారిటితో గెలిచారు. దానికితోడు పార్టీ కూడా అధికారంలోకి రావటం+బాలినేని మంత్రవ్వటంతో ఇక తమ సమస్య శాశ్వతంగా పరిష్కారమైనట్లే అని జనాలు హ్యాపీ ఫీలయ్యారట.
అయితే జనాలు ఒకటనుకుంటే మరోటి జరుగుతోంది. తాము ఓట్లేసిన అభ్యర్ధే గెలిచినా, పార్టీ అధికారంలోకి వచ్చినా, బాలినేని మంత్రయినా కూడా జనాల సమస్య తీరలేదు. పైగా ఇప్పటికన్నా టీడీపీ హయాంలోనే నయం అని జనాలు అనుకునేట్లుగా పరిస్దితులు దిగజారిపోయాయట. ఎలాగంటే టీడీపీ హయాంలో ఒంగోలు పరిధిలోని చాలా కాలనీల్లో మూడు రోజులకు ఒకసారి మంచినీరు అందేది. మున్సిపాలిటీ అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేవారు.
ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశ్యంతోనే మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్షలు నిర్వహించారు. మంచి అధికారులుగా పేరున్న వారిని ఏరికోరి మరీ బయట నుండి మున్సిపాలిటిలోకి తెచ్చుకున్నారు. అయితే సమస్య పరిష్కారం కాకపోగా మరింత ముదిరిపోయిందట. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇపుడు పదిరోజులకు ఒకసారి మంచినీరు సరఫరా అవుతోందట. దాంతో జనాలంతా బాలినేనిపై మండిపోతున్నారు. టీడీపీ హయాంలోనే మూడురోజులకు ఒకసారి మంచినీరు వచ్చేదని ఇపుడు పదిరోజులకు ఒకసారి వస్తోందనే విషయాన్ని జనాలు ప్రస్తావిస్తున్నారు.
దాంతో బాలినేనికి విషయం తెలియటంతో సమస్య పరిష్కారం కోసం పదే పదే అధికారులతో సమీక్షలు పెడుతున్నారు. ఎన్ని సమీక్షలు పెడుతున్నా సమస్యయితే పరిష్కారం కావటం లేదు. ఇదే విషయమై మున్సిపాలిటితో పాటు నియోజకవర్గంలో పర్యటించినపుడు బాలినేని చాలా చెరువులు మంచినీటితో కళకళలాడుతు కనిపించాయి. మరి చెరువుల్లో మంచినీరున్నా జనాలకు ఎందుకు అధికారులు అందించలేకపోతున్నారన్నదే మంత్రికి అర్ధంకావటంలేదు.
మంచినీటి సమస్యను పరిష్కారిస్తారన్న కారణంతోనే బాలినేని మంచి అధికారులను తెప్పించుకున్నా ఉపయోగం కనబడటం లేదు. ఏం మంత్రివయ్యా బాబూ తాగడానికి రోజూ నీళ్లు ఇస్తావనుకుంటే వచ్చేవి కూడా రాకుండా చేస్తున్నావని జనం నసుగుతున్నారు. ఎందుకిలా అంటే మంత్రి ఎన్ని ప్రయత్నాలు చేశారన్నది జనాలకు అవసరం లేదు. తమ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అన్నదే ప్రధానం. కాబట్టి వచ్చే ఎన్నికల్లోపు సమస్య గనుక పరిష్కారం కాకపోతే బాలినేనికి ఇబ్బందులు తప్పేలా లేదు.