నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం.. గవర్నర్ తన ప్రసంగం మొదలుపెట్టడం.. వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా కోసం నినాదాలు చేయడం.. సభ నుంచి వాకౌట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. హమ్మయ్య జగన్ మారారు.. అసెంబ్లీకి వెళ్తున్నారు.. ప్రజల తరఫున మాట్లాడతారు.. అని అనుకునేలోపే మళ్లీ ప్రతిపక్షం కావాలంటూ లొల్లి చేశారు. పట్టుమని 11 నిమిషాలు కాకుండా సభ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు విమర్శలకు గురవుతున్నారు. తాజాగా జగన్ తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్స్ పేల్చారు.
అనర్హత వేటు పడుతుందని భయపడే జగన్ సహా ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీకి వచ్చారని.. హాజరు వేయించుకుని వెళ్లిపోయారని అచ్చెన్న మండిపడ్డారు. ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చినా జగన్ మారడం లేదన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే శాసనసభకు రామని బెదిరిస్తున్న వైసీపీ ఒక రాజకీయ పార్టీయేనా? ఢిల్లీకి సీఎంగా పనిచేసి మొన్నటి ఎన్నికల్లో ఓడిన కేజ్రీవాల్ అసెంబ్లీకి వెళ్తానంటే అర్థం ఉంటుందా? అని అచ్చెన్న ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని జగన్ ఎద్దేవా చేయాలేదా? అని ప్రశ్నించారు. అప్పుడేమో అలా మాట్లాడి.. ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగానికి విరుద్ధంగా అడగడం విడ్డూరంగా ఉందని అచ్చెన్న అన్నారు. నాలుగు రోజుల తర్వాత నాకు సీఎం పదవి ఇస్తానంటేనే అసెంబ్లీకి వస్తానని అంటారేమో అంటూ జగన్ పై సెటైర్లు పేల్చారు. రాజకీయాల్లోకి వచ్చాక ఎటువంటి హోదా ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పని చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు.