ఒక రాష్ట్రాభివృద్ధిలో రాజధాని ఎంతో కీలక పాత్ర వహిస్తుందనడానికి తెలంగాణలోని హైదరాబాద్ నగరమే నిదర్శనం. తెలంగాణ సర్కార్ ఖజానాకు హైదరాబాద్ నగరం కామధేను వంటింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలు కావడంతో మూడు దశాబ్దాల పాటు ముచ్చటపడి అభివృద్ధి చేసుకున్న ఉమ్మడి రాజధాని నగరాన్ని ఆంధ్రా ప్రజలు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో, హైదరాబాద్ తరహాలోనే అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలని టీడీపీ అధినేత, నాటి ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.
అమరావతి రాజధాని కోసం ఏపీ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రావాసులు, తెలుగు ప్రజలు తమ వంతు సాయం చేశారు. అమరావతి రాజధాని కోసం రైతులు పచ్చటి పంటపొలాలను త్యాగం చేస్తే…ఎన్నారైలో కోట్ల రూపాయల విరాళాలిచ్చారు. ఇలా సమిష్టి కృషితో అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో జగన్ సీఎం అయ్యారు. అప్పటి నుంచి ఏపీలో రాజధాని వ్యవహారం…పేకాటలో మూడు ముక్కలాటలా మారింది.
అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ పేరుతో జగన్ మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఆ పల్లవిని అందుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు…మూడు ముక్కలాటాడుతూ మూడు రాజధానులకు వత్తాసు పలికారు. ఆ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ రాజధాని వ్యవహారంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరో కొత్త పల్లవి అందుకొని అంతులేని ముక్కలాటకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటూ గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
పులివెందులైనా…విజయవాడైనా…లేదా మరో ప్రాంతమైనా…జగన్ ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటూ గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం నివాసం ఎక్కడుంటే అక్కడే సెక్రటరియేట్…అదే రాజధాని అని గౌతమ్ రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. పైగా, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామంటూ గౌతమ్ రెడ్డి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మరి, రేపు మరో వైసీపీ ఎమ్మెల్యేనో, మంత్రో లేక మరో ప్రభుత్వ సలహాదారో వచ్చి….జగన్ సిమ్లాలో ఉంటే అదే రాజధాని అని…ఆయన ఢిల్లీ వెళితే ఆ రోజుకు ఏపీకి అదే రాజధాని అంటారేమోనని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.