రాజకీయాల్లో కర్రపెత్తనం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? అవకాశం రావాలేకానీ.. ఎవరైనా రెచ్చిపోతా రు. నిజానికి నేటి తరం నేతలు కోరుకుంటున్నదే అది కదా! పదవులు, బాధ్యతలు, అధికారాల కోసం నేటి నేతలు పడిచచ్చిపోతున్నారనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో మాట చెప్పాలంటే.. అసలు పదవుల కోసం, అధికారం కోసమే నేటి తరం నాయకులు రాజకీయాల్లోకి వస్తున్నారేది ఫక్తు వాస్తవం. అయితే, దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు వైసీపీకి చెందిన యువ మంత్రి. ఇప్పుడు ఈ విషయంలో పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
నెల్లూరుకు చెందిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. సౌమ్యుడు, వివాద రహితుడు, సైలెంట్‌గా తనపనేదో తాను చేసుకునే టైపు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయన వేరేవారి విషయంలో వేలు పెట్టరు. ఒకవేళ ఎవరైనా తన విషయంలో జోక్యం చేసుకుని విమర్శలు చేసినా.. సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తారే తప్ప.. ఎదురు దాడి చేసే టైపుకాదు. దీంతో ఆయన ఓ అజాత శత్రువుగా అతి చిన్న వయసులోనే గుర్తింపు పొందారు. రెడ్డి సామాజిక వర్గంలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ.. ఈ యువనేతను ఫాలో అవడమే దీనికి తార్కాణం.
అయితే, గత కొన్నాళ్లుగా నెల్లూరు వైసీపీలో అంతర్గత పోరు తారస్థాయిని చేరింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, ప్రన్నన్న కుమార్‌రెడ్డి వంటివారు వివాదాలకు కేంద్రంగా మారారు. దీంతో వారిని సముదాయించడం అధిష్టానం వల్లకూడా కాలేదు. అయితే, ఉంటే ఉండడం పోతే పోండి అని హెచ్చరించడంతో సైలెంట్ అయ్యారు. అయితే, ఇప్పుడు ఈ సైలెంట్ పార్టీకి పెను ఇబ్బందిగా పరిణమించింది. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గాన్ని సమన్వయం చేసే బాధ్యతను మంత్రి మేకపాటికి అప్పగించేందుకు జగన్ సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది.
దీంతో జిల్లాకు చెందిన రెడ్డి నేతలు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు అప్పాయింట్‌మెంట్‌కోసం వేచిచూస్తున్నారు. కానీ, మంత్రి మాత్రం తాను పరిష్కరించే సమస్యలైతేనే వింటానని, అన్నీ చెప్పి.. తనపై భారం వేసేసి.. రేపు తనను కూడా విమర్శించే అవకాశం తీసుకుంటే కుదరదని.. నేరుగా హింట్ ఇస్తున్నారట. అంతేకాదు.. “సార్.. ఇప్పటికే మంత్రిగా నేను బిజీ ఈ బాధ్యతలను వేరేవారికి ఇవ్వండి“ అని ఇంచార్జ్ మంత్రికి ఆయన లేఖరాసినట్టు నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి ఆయన బిజీగా ఉన్నా లేకున్నా.. రెడ్డి వర్గం అసంతృప్తిని తాను సరిచేయలేనని, ఈ వివాదంలోకి వేలు పెట్టకుండా ఉంటేనే మంచిదని భావిస్తున్నట్టు సీనియర్లు అంటున్నారు.