నటి మీనా భర్త విద్యాసాగర్ కొవిడ్ అనంతర సమస్యలతో ప్రాణాలు కోల్పోవడం అందరికీ పెద్ద షాక్. వివాహం అయిన 13 ఏళ్లకే మీనా తన భర్తను కోల్పోవడం బాధాకరం. ఆయనకు గత ఏడాది కరోనా సోకాక కొన్ని రోజులకే తగ్గిపోయింది. కానీ కొవిడ్ అనంతర సమస్యలు ఆయన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. దీంతో ఆరు నెలల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది.
ఇంతలో మరోసారి కొవిడ్ సోకింది. మళ్లీ నెగెటివ్ వచ్చినప్పటికీ.. ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రమై.. చివరికి అవి పని చేయడం మానేసి ప్రాణాలు కోల్పోయారు. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడానికి పావురాలు కారణమట. బెంగళూరులో వ్యాపారం చేసే విద్యాసాగర్.. తన ఇంట్లో పావురాలు పెంచేవారట.
శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారికి పావురాలతో ముప్పు పొంచి ఉంటుంది. అవి విసర్జించే మలమూత్రాల కారణంగా విద్యాసాగర్‌కు ఇన్ఫెక్షన్ తీవ్రమై, శ్వాస పీల్చడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి.
కాగా విద్యాసాగర్‌కు అసలు సమస్య ఎక్కడ తలెత్తిందో.. ఆయన ప్రాణాలు పోవడానికి కారణమేంటో.. మీనాకు సన్నిహితురాలైన డ్యాన్స్ మాస్టర్ కళ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘కొవిడ్ బారిన పడకముందే విద్యాసాగర్‌కు బర్డ్ ఇన్ఫెక్షన్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ ఏడాది జనవరిలో కొవిడ్ బారిన పడి ఆయన కోలుకున్నారు. ఫిబ్రవరిలో తన పుట్టిన రోజు వేడుక కూడా జరిగింది. అప్పుడాయన బాగానే ఉన్నారు. మార్చిలో మీనా ఫోన్ చేసి సాగర్ ఆరోగ్యం బాలేదని చెప్పారు.
అప్పుడు ఆసుపత్రికి వెళ్తే సాగర్ మరీ ఇబ్బందికరంగా ఏమీ లేరు. ఏప్రిల్‌లో ఆయనకు సీరియస్ అయింది. సాగర్ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ తీవ్రం అయిందని, ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారు. ఇందుకోసం మూడు నెలలు ప్రయత్నించాం. తమిళనాడు మంత్రులతో పాటు ముఖ్యమంత్రితో కూడా మాట్లాడాం. అందరూ సాయం చేశారు కానీ.. అవయవం దొరకలేదు.
రోజు రోజుకూ సాగర్ ఆరోగ్యం క్షీణించింది. కానీ చివరి శ్వాస విడిచే వరకు సాగర్ ధైర్యంగానే ఉన్నారు. ఆయన్ని కాపాడుకునేందుకు మీనా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది’’ అని కళ ఆవేదన వ్యక్తం చేశారు.