తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ను కేసీఆర్ పరుగులు పెట్టిస్తున్నారు. అందరికంటే ముందుగానే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో నవంబర్ 30న జరిగే పోలింగ్ కు సిద్ధమవుతున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కు ఓ సమస్య వచ్చి పడింది. గెలుస్తామనే నమ్మకంతో ఉన్న బీఆర్ఎస్ కు ఇబ్బంది ఎదురవుతోంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్.. ఇప్పుడు కేసీఆర్ కు డ్యామేజీగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచంలోనే అద్భుతమైన నిర్మాణం అని, తెలంగాణను సస్య శ్యామలం చేస్తోందని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ గొప్పగా చెబుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు పై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇందులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లా మారిందని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తోంది. ఈ ఆరోపణలను బలంగానే తిప్పికొడుతున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం సమస్యగా మారిందనే చెప్పాలి. దొరికిందే అవకాశం అని మేడిగడ్డను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర విపక్షాలు బీఆర్ఎస్ పై విమర్శల దాడి పెంచాయి.
తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది. అందుకే కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు మేడిగడ్డ కాంగ్రెస్ కు వరంలా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ రెచ్చిపోతోంది. రాహుల్ గాంధీ ఏకంగా మేడిగడ్డ వెళ్లి మరీ పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక బీజేపీ కూడా ఇదే విషయంపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ నాయకులు కూడా మేడిగడ్డ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ జన సమితి లాంటి ఇతర పార్టీలు కూడా మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ ను విమర్శిస్తున్నాయి. మరి మేడిగడ్డపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టి కేసీఆర్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి.