కాదేదీ రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. `నేను దూరం నా వారు దగ్గర` అనే నానుడిని నేతలు నిజం చేస్తున్నారు. అంటే.. ఒక పార్టీ ఎవరైనా నేత దూరమైనా.. తన కుటుంబంలోని వారిని చేరువ చేయడం ద్వారా తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారన్నమాట. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిణామమే ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో జరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
రాజంపేట నియోజకవర్గంలో రాజకీయ పదనిసలు మారుతున్నాయి. 2019లో ఇక్కడ గెలిచిన మేడా మల్లికార్జున రెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే, ఆయనకు టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని కొందరు నేతలు బాహాటంగానే చెబుతున్నారు. దీనికి స్థానికంగా ఉన్న వ్యతిరేకతతో పాటు అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత.. రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చాలన్న స్థానికుల అభిప్రాయాలను పార్టీ తీసుకోలేదు.
దీంతో ఇక్కడ స్థానిక సెంటిమెంటుకొనసాగుతోంది. ఇక, అభివృద్ది పరంగా కూడా.. మేడా చేసిందేమీ లేద నే టాక్ స్థానికంగా వైసీపీ నేతల మధ్యే వినిపిస్తోంది. పైగా.. ఆయన తమను పట్టించుకోలేదని అంటున్నా రు. ఈ క్రమంలో మేడా కుటుంబం నుంచి విజయశేఖరరెడ్డి వచ్చి.. టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకోవడం రాజకీయంగా రాజంపేటలో వేడి పుట్టిస్తోంది. నిజానికి మేడా ఫ్యామిలీ వేర్వేరు కాదు. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి కలిసి పనిచేశారు.
సో.. అలాంటి నాయకుడు ఇప్పుడు అనూహ్యంగా టీడీపీలోకి వస్తానని చెప్పడం.. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోరడం వంటివి టీడీపీలోనూ చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇక, చంద్రబాబు కూడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, క్షేత్రస్థాయిలో టాక్ ఏంటంటే 2014లో మేడా మల్లికార్జున రెడ్డి టీడీపీ తరఫున విజయం దక్కించుకుని వైసీపీ పంచకు చేరిపోయారు.
ఇక, ఇప్పుడు ఆయన సోదరుడు వైసీపీ ఓడి పోతుందనే అంచనాతోనే టీడీపీకి జైకొడుతున్నారు. దీనిని ప్రోత్సహించవద్దనేది స్థానికంగా వినిపిస్తున్న మాట. పార్టీని నమ్ముకున్నవారిని పక్కన పెట్టొద్దని.. ఇలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.