ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వనీదత్ తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం.. ఎయిర్ పోర్టు అథారిటీలను పార్టీలుగా చేరుస్తూ ఆయన పిల్ వేశారు. తనకు వారిద్దరు రూ.210 కోట్లు చెల్లించాలని కోరుతున్నారు. అందుకు కోర్టు తనకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇంతకూ ఆయన పిటిషన్ లో ఏముంది? ఆయన వాదన ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే.. గన్నవరం ఎయిర్ పోర్టు కోసం ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి 39 ఎకరాలు ఇచ్చినట్లుగా అశ్వనీదత్ పేర్కొన్నారు. ఈ భూమి విలువ ఎకరం రూ.1.54కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ భూమికి సరిసమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకున్న వైనాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇప్పుడు రాజధానిని వేరే చోటుకు తరలించాలని నిర్ణయించారు. దీంతో.. తనకు ఇచ్చే భూమి ఎకరం విలువ రూ.30 లక్షలు కూడా చేయదన్నది అశ్వనీదత్ వాతద. అందుకే.. తాను ఇచ్చిన 39 ఎకరాలకు రూ.210 కోట్లు చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని.. ఎయిర్ పోర్టు అథారిటీని ఆయన కోరుతున్నారు.
ప్రభుత్వానికి తానిచ్చిన 39 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ ఎకరం రూ.1.84కోట్లకు చేరుకున్నదని.. భూసేకరణ కింద ఈ భూమికి నాలుగు రెట్లు చెల్లించి ఎయిర్ పోర్టు అథారిటీ కానీ ఏపీ సర్కారు కానీ ప్రభుత్వ నిర్మాణాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అశ్వనీదత్ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి అతను భూమి ఇచ్చాడు. ఆ హామీ నెరవేర్చని పక్షంలో తన భూమి తనకివ్వాలి, లేకపోతే పరిహారం కట్టివ్వాలి కదా. ఈయన కేసు గెలిస్తే.. అశ్వనీదత్ బాటతో రానున్న రోజుల్లో మరెందరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.