టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వారసుడిగా, రాజకీయ వారసుడిగా నారా లోకేష్ పై టీడీపీ లీడర్లు….క్యాడర్ చాలా ఆశలు పెట్టుకుంది. భవిష్యత్తులో టీడీపీని నడిపించే యువనేత, పార్టీ బాధ్యతలను భుజస్కంధాలపై మోసే భావి అధ్యక్షుడు లోకేష్ అని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచే లోకేష్ పోటీ చేసి విజయ దుందుభి మోగించాలని మంగళగిరి టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే లోకేష్….అడుగులు వేస్తున్నారు.
2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గం నుంచే రాబోయే ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతానని లోకేష్ ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా ఇటు గుంటూరు, అటు కృష్ణా రెండు జిల్లాల టీడీపీ నేతల్లో జోష్ వస్తుందని లోకేష్ ప్రణాళికలు రచిస్తున్నారట. గత ఎన్నికల్లో ఓటిమి నుంచి పాఠాలు నేర్చుకున్న లోకేష్ ఈసారి పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్లబోతున్నారట.
2014లో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవి ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేవలం 12 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే, బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరి నుంచి 2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేశారు టీడీపీకి పట్టుకొమ్మలైన.బీసీలు లోకేష్ కు బంపర్ మెజారిటీ ఇస్తారని అనుకున్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం నేపథ్యంలో లోకేష్ గెలుపు ఖాయమని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా 5 వేల పై చిలుకు ఓట్ల తేడాతో లోకేష్ ఓడిపోయారు. దీంతో, రాబోయే ఎన్నికల్లో లోకేష్ మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని టీడీపీ నేతలు కొందరు అనుకున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో లోకేష్ అందుబాటులో ఉండడం లేదని కొందరు అనుకుంటున్నట్టు పుకార్లు వస్తున్నాయి.
ఆ పుకార్లకు లోకేష్ చెక్ పెట్టారు. గత ఓటమి తనకు పాఠాలు నేర్పిందని, రాబోయే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని లోకేష్ ప్రకటించారు. మంగళగిరి ప్రజలు కూడా కావాలి లోకేష్ రావాలి లోకేష్ అని కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారి సమసిపోయిన తర్వాత లోకేష్ మంగళగిరి ప్రజలతో మమేకమై…రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని మంగళగిరి టీడీపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు.