ఇంతకు మించిన బ్యాడ్ లక్ మరొకటి ఉండదేమో. కరోనా పాజిటివ్ గా తేలిన ఒక వ్యక్తి.. దాంతో పోరాడుతున్న వేళలోనే.. మూడు ఫంగస్ లు మూకుమ్మడిగా దాడి చేసిన వైనం తాజాగా వెలుగు చూసింది.
చాలా అరుదుగా జరిగే ఈ ఉదంతంలో సదరు వ్యక్తి మరణించిన విషాదమిది. కరోనా పాజిటివ్ గా మారి.. దాని నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్.. వైట్.. ఎల్లో ఫంగస్ ల్లో ఏదో ఒకటి దాడి చేయటం ఇటీవల కాలంలో ఎక్కువైంది.
అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన 59 ఏళ్ల కున్వర్ సింగ్ అనే వ్యక్తి కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరాడు. అతడికి వైద్య పరీక్షల్ని నిర్వహించిన వైద్యులు.. ఎండోస్కోపీ తీయించారు. ఆ రిపోర్టును చూసిన వైద్యులు అదిరిపడ్డారు.
ఎందుకంటే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఫంగస్ లు అతనిలో కనిపించాయి.
బ్లాక్.. వైట్.. ఎల్లో ఫంగస్ లు అతనిపై దాడి చేయటంతో.. బాధితుడి శరీరంలోని రక్తం మొత్తం విషపూరితంగా మారిపోయింది. దీంతో.. అతగాడి ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింది. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మరణించాడు. ఇలా ఒకే వ్యక్తికి కరోనాతో పాటు..మూడు ఫంగస్ లు ఏకకాలంలో దాడి చేయటం చాలా అరుదుగా జరుగుతుందని చెబుతున్నారు.