ఆయనో ఎస్సై మొత్తం ఏపీ పోలీసు శాఖలో ఆయన స్థానం చాలా చిన్నది. కానీ.. ఆయన మీద వస్తున్న ఆరోపణలు మాత్రం సంచలనంగా మారుతున్నాయి. కొందరు పోలీసు ఉన్నతాధికారులు సైతం ముక్కున వేలేసుకునేలా ఆయన తీరు ఉందన్నది తాజా ఆరోపణ. ఏపీలోని పల్నాడు ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఎస్ఐ వ్యవహారంపై ప్రభుత్వంలోని పెద్దలు వెంటనే స్పందించాలని.. ఆయన స్పీడ్ కు బ్రేకులు వేయకుంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న మాట వినిపిస్తోంది.
పల్నాడు జిల్లా మాచర్లనియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో చోటు చేసుకున్న వరుస పరిణామాలు తరచూ వార్తలుగా మారుతున్నాయి. వెల్దుర్తి మండలానికి చెందిన విపక్ష టీడీపీ సానుభూతిపరుల్ని పార్టీ మారాలంటూ జులుం చేస్తున్నారన్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఒకవేళ పార్టీ మారకుంటే తనకు రూ.2 లక్షలు కప్పం కట్టాలని డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు అధికార పార్టీ వైపు వేలెత్తేలా చూపిస్తున్నాయి.
ఇటీవల కొందరిపై ఎస్ఐ చూపించిన దాష్ఠీకాన్ని భరించలేని దుర్గారావు అనే మత్య్సకారుడు తాజాగా ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. వెల్దుర్తి మండలం బంగారుపెంట తండా సమీపంలోని క్రిష్ణా నది ఒడ్డున కొన్ని మత్స్యకార కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. వీరంతా దశాబ్దాల క్రితమే ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడకు వలస వచ్చారు. నదిలో చేపలు పట్టటం ద్వారా జీవనం సాగించే వీరికి కొంతకాలంగా కొత్త తిప్పలు ఎదురవుతున్నాయి.
మద్యం అక్రమ రవాణా చేసే వారు.. వీరి పడవల్ని ఉపయోగిస్తున్నారు. అందుకు నో అంటే వారి నుంచి ఇబ్బంది. ఒకవేళ.. వారి ఒత్తిళ్లకు భయపడి పని చేస్తే.. పోలీసులు ఇతర అధికారుల నుంచి కేసులు పెట్టటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదే తరహాలో దుర్గారావు మీద ఒక కేసు నమోదైంది. అతడు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకుున్నాడు. అయితే.. దుర్గారావును కేసు పేరుతో స్టేషన్ కు పిలిపించే ఎస్ఐ పార్టీ మారాలని లేదంటే రూ.2 లక్షలు తనకు కప్పం కట్టాలంటూ హుకుం జారీ చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఒత్తిళ్లను తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.ఇటీవల కాలంలో ఎస్ఐ వేధింపులు ఎక్కువ అవుతున్నాయని.. వాటిని తాను తట్టుకోలేకపోతున్నట్లుగా అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దుర్గారావు డెడ్ బాడీతో వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రెండు గంటల పాటు నిరసన తెలిపిన అనంతరం.. ఉన్నతాధికారుల జోక్యంతో అంతిమ క్రతువుల కోసం డెడ్ బాడీని కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయారు. ఈ ఉదంతం మాచర్ల నియోజకవర్గంలో సంచలనంగా మారింది.