వేలాదిగా పెరగిపోతున్న ఆందోళనకారుల దెబ్బకు రాజీనామా చేసిన ప్రధానమంత్రి రాజపక్సే కుటుంబం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్లు సమాచారం. శ్రీలంక మీడియా మాత్రం రాజపక్సే కుటుంబం కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేవీ బేస్ లో తలదాచుకుంటున్నట్లు చెబుతోంది. అయితే ఈ వార్తలను అధికారులు ఎవరు ధృవీకరించటం లేదు. కాబట్టి రాజపక్సే కుటుంబం ఆందోళనకారుల దెబ్బకు ఎక్కడో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది మాత్రం వాస్తవమని అర్ధమవుతోంది.
ఆర్థిక సంక్షోభంలో అతలాకుతలం అయిపోతున్న దేశంలో ఆందోళనలు, నిరసనలు రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రధానమంత్రి, అధ్యక్ష భవనాలను వదిలిపెట్టకుండా ఆందోళనకారులు ముట్టడిస్తున్నారు. ప్రధానమంత్రి అధికారిక నివాసంలోకి చొరబడేందుకు ఆందోళనకారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆందోళనకారులు అధికారిక నివాసంలోకి అడుగుపెట్టకుండా భద్రతా దళాలు భాష్ప వాయువులను ప్రయోగిస్తున్నారు. మొత్తం మీద ప్రధాని భవనం పెద్ద రణరంగంగా మారిపోయింది.
ఎప్పుడైతే భద్రాతా సిబ్బంది ఆందోళనకారులను అడ్డుకుంటున్నారో వెంటనే జనాలు భవనం కాంపౌండ్లోకి పెట్రోలు బాంబులు విసురుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కనీసం పది పెట్రోల్ బాంబులు భవనం లోపల పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు కూడా చెప్పారు. అలాగే రాజపక్సే కొడుకు సమల్ కుటుంబం కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న జనాల ఆందోళనలు, ఒత్తిడికి ప్రధానమంత్రిగా రాజపక్సే రాజీనామా చేసినా జనాల ఆందోళన మాత్రం తగ్గటం లేదు.
ఎందుకంటే ఇంకా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పదవిలోనే ఉన్నారు. అలాగే మరో కుటుంబ సభ్యుడు ఆర్థికమంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. అంటే మొత్తం రాజపక్సే కుటుంబం అంతా కలిసి దేశాన్ని నాశనం చేసేసినట్లు అర్ధమవుతోంది. ఎప్పుడైతే జనాల ఆందోళనలకు అధ్యక్షుడు తలొంచకుండా ఇంకా పదవిలో ఉన్నారో జనాలకు మండిపోయి క్యాబినెట్ మంత్రుల ఇళ్ళు, కొందరు ఎంపీల ఇళ్ళను తగలబెడుతున్నారు. హంబస్ టోట లోని రాజపక్సే పూర్వీకుల ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టేశారు. రాజపక్స మ్యూజియంను ధ్వంసం చేసేశారు. కరునెగాలలోని మహీంద నివాసాన్ని కూడా ధ్వంసం చేసేశారు. మొత్తానికి శ్రీలంకలో పరిస్ధితి ఏ రోజు ఎలా మలుపుతిరుగుతుందో ఎవరు చెప్పలేకున్నారు.