మహాసేన రాజేష్ కు పి.గన్నవరం నియోజకవర్గ టికెట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వైసీపీపై రాజేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దళితుల సమస్యలపై ఎన్నోసార్లు రాజేష్ గళమెత్తారు. అయితే, అనూహ్యంగా రాజేష్ తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు. తనపై వైసీపీ కార్యకర్తలు దుష్ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల టీడీపీ జనసేన కూటమిపై ప్రభావం పడుతుందని అన్నారు. అందుకే అవసరమైతే పోటీ నుంచి వైదొలుగుతానని రాజేష్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది.
ఏడేళ్ల క్రితం తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి వక్రీకరించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన తనకు ఉందని, పదవులు ముఖ్యం కాదని రాజేష్ చెప్పుకొచ్చారు. తన వీడియోలతో టిడిపి జనసేన కూటమిని కించపరిచేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సామాన్యుడికి అవకాశం వస్తే వ్యవస్థ ఎలా ఏకమై పోతుందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పోటీ చేయడానికి తనకు అవకాశం వస్తేనే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ తాను గెలిస్తే చంపేస్తారేమో అని రాజేష్ అన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డి, సుబ్రహ్మణ్యం హత్యకేసు నిందితుడు ఎమ్మెల్సీ అనంత బాబు ఎన్నికల్లో ప్రచారం చేస్తారని, కానీ రాజేష్ మాత్రం పోటీ చేయకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ దుష్ప్రచారం పట్టించుకోకుండా తనను పోటీ చేయాలని కోరితే టీడీపీ జనసేన కూటమి గెలిచే మొట్టమొదటి నియోజకవర్గం పి.గన్నవరం అవుతుందని రాజేష్ క్లారిటీనిచ్చారు. మరి రాజేష్ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.