ఏపీలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి(రాజమహేంద్రవరం)లో శనివారం, ఆదివారం ఒక పండుగే జరగనుంది. ప్రస్తుతం తెలుగు వారికి ప్రత్యకంగా పండుగలు లేకపోయినా.. మహానాడు రూపం లో తెలుగు వారికి మహా పండుగే వచ్చిందనడంలో సందేహం లేదు. రాజమహేంద్రవరం పసుపుమయంగా మారిపోయింది. భారీ స్వాగత తోరణాలు, తెలుగుదేశం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో మహానాడు వేదిక కొత్త కళ సంతరించుకుంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీలోని కడియం మండలం వేమగిరి వద్ద రెండు రోజుల పాటు నిర్వహించనున్న మహానాడుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంతోపాటు.. ఎన్నికల ఏడాదికావడంతో చరిత్రలో నిలిచిపోయేలా ఈసారి మహానాడును తెలుగుదేశం పార్టీ వైభవంగా నిర్వహిస్తోంది. నగరమంతటా పసుపు జెండాలతో కళకళలాడుతోంది. దీంతో ఎటు చూసినా తెలుగు వారికి పండుగ వచ్చిందనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకులు.
తొలిరోజు ప్రతినిధుల సభ నిర్వహించనుండగా.. రేపు బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల సభ కోసం 10 ఎకరాల్లో, బహిరంగ సభ కోసం 60 ఎకరాల్లో ప్రాంగణాలు, వేదికలు సిద్ధం చేశారు. 15 వేల మంది పార్టీ ప్రతినిధులకు ఆహ్వానాలు పంపగా.. వీరితోపాటు మరో 35 వేల మంది కార్యకర్తలు రానున్నట్లు సమాచారం. ఆదివారం నిర్వహించే బహిరంగ సభకు లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉండటంతో 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు, లోకేష్ సహా పార్టీ ముఖ్య నేతలు కూర్చేనేందుకు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సభా వేదిక నిర్మించారు.