ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార.. విపక్షాలు బలంలో పోటాపోటీగా ఉండటంతో రాజకీయం రంజుగా మారింది. ఇటీవల నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ కావటంతో తెలుగు తమ్ముుళ్లలో కొత్త ధీమా తొణికిసలాడుతోంది.
మహానాడుతో వచ్చిన మైలేజీని పోగొట్టుకోకుండా.. దాన్ని కంటిన్యూ చేసేందుకు వీలుగా కొత్త ప్లాన్ ను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు రాజకీయ వారసుడిగా చెప్పే నారా లోకేశ్ తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.
తన తండ్రి చంద్రబాబు మాదిరి పాదయాత్రను చేపట్టాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్రను చేపడితే.. ఇప్పుడు విభజిత ఏపీలో పాదయాత్రను చేపట్టాలని లోకేశ్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబు పాదయాత్ర హిందూపురంలో మొదలై తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్ర చేరుకొని విశాఖలో ముగించిన వైనం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబరు 2న పాదయాత్రను షురూ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే.. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. దానిపై ఏమైనా స్పష్టత వస్తే.. లోకేశ్ పాదయాత్ర మరింత ముందుకు జరిగే అవకాశం ఉందంటున్నారు. గతంలో చంద్రబాబు సైతం అక్టోబరు రెండున స్టార్ట్ చేసిన నేపథ్యంలో లోకేశ్ విషయంలోనూ అదే డేట్ సెంటిమెంట్ ను కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే.. దీనికి సంబంధించి మరింత కసరత్తు పార్టీలో జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.
ఒంగోలులో ఇటీవల నిర్వహించిన మహానాడుకు అంచనాలకు మించిన జనం హాజరైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కొత్త ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఈ ధీమాను కంటిన్యూ చేసేలా.. పాదయాత్రను చేపట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేశ్ తన సత్తాను చాటుకోలేదన్న మాట వినిపిస్తున్న వేళ.. ఈ పాదయాత్ర ఆ కొరతను తీర్చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.