మలక్ పేటలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం సందర్భంగా తన గన్ మెన్ పై హోం మంత్రి మహమూద్ అలీ చేయి చేసుకున్న ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అదే రోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం కావడంతో మహమ్మద్ అలీ తలసానిని హగ్ చేసుకుని బొకే ఇవ్వాలనుకున్నారు. అయితే, సమయానికి బొకే చేతికి అందకపోవడంతో ఆయన అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆయనపై విమర్శలు రావడంతో మహమ్మద్ అలీ వెనక్కి తగ్గి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఆ గన్మెన్ తన కొడుకు వంటివాడు అని, ప్రేమతో అలా చేశానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అతడిని కొట్టాలన్న ఉద్దేశం తనకు లేదని క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. తాను అందర్నీ గౌరవిస్తానని వివరణ ఇచ్చారు. ఆ ఘటన వివాదాస్పదంగా మారడంతో అలీపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సాధారణ పౌరుడు ఇలా చేసి ఉంటే పోలీసులు ఈపాటికి ఎటువంటి చర్యలు తీసుకుని ఉండేవారో అందరికీ తెలుసని రాజాసింగ్ అన్నారు.