ఏపీ అధికార పార్టీ వైసీపీకి కీలక ఎంపీ గుడ్ బై చెప్పారు. అంతేకాదు, ఆయన రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటిం చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని వెల్లడించారు. అయితే, ఆయన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. తన కుమారుడు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. ఆయనే వైసీపీలో కొన్నాళ్లుగా వివాదాల చుట్టూ తిరుగుతున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. కారణాలు ఏవైనా.. ఆయనకు వైసీపీ ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఆయన కోసం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేదు.
పోనీ.. ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని అయిన పార్టీలోకి తీసుకుని ఒంగోలు సీటు ఇవ్వాలని కోరారు . అది కూడా వైసీపీ సాధ్యం కాదని చెప్పేసింది. సుదీర్ఘ కాలం వేచి చూసిన మాగంటి కుటుంబానికి వైసీపీలో అనేక అవమానాలు ఎదురయ్యా యని ఆయన అనుచరులు చెబుతున్నారు. తాజాగా ఈ కుటుంబానికి టీడీపీ నుంచి ఆహ్వానం అందింది. ఈ క్రమంలో మాగుంట కుటుంబం ఈ నెల 16న చంద్రబాబు సమక్షంలో టీడీపీలోచేరేందుకు ఏర్పాటు చేసుకుంది.
ఈ దఫా ఎన్నికలకు తాను దూరంగా ఉంటున్నానని మాగుంట ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తాను పోటీ చేయబోనన్నారు. తన స్థానంలో తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని తాజాగా వెల్లడించారు. కాగా, శ్రీనివాసులు రెడ్డి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. మాగుంట చేరికతో టీడీపీకి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయప డుతున్నారు. అయితే, రాఘవ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది టీడీపీ అధిష్టానం ప్రకటించనుంది. ప్రస్తుతం ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బలమైన నాయకుడిగా ఉన్న మాగుంట కుటుంబానికి ఆ స్థానమే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
మాగుంట కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం ఉంది. మాగుంట సోదరులు ఇద్దరూ కాంగ్రెస్‌లో దాదాపు 40 ఏళ్లుగా ఉన్నారు. లిక్కర్ వ్యాపారంలో అజాత శత్రువులుగా ఎదిగిన మాగుంట బ్రదర్స్‌లో ఒకరు చనిపోవడంతో శ్రీనివాసరెడ్డి తర్వాత.. రాజకీయంగా ముందుకు వచ్చారు. పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే.. పార్టీలో ఏర్పడిన అసంతృప్తులు.. అధిష్టానం నుంచి అవమానాల నేపథ్యంలో మాగుంట కుటుంబం బయటకు రావడం గమనార్హం. ఈ సంపతి ఒంగోలు పార్లమెంటులో ఎక్కువగా పనిచేస్తుందనే అంచనా లువస్తున్నాయి.