- మూడు రాజధానులకు జగన్ మంగళం
- ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి
- అమరావతికి అన్ని ప్రాంతాల మద్దతు
- జనం మద్దతుతో జోరుగా పాదయాత్ర
- అమరావతికి మద్దతుగా అమిత్‌షా
- రంగంలోకి దిగిన కమలనాథులు
- ఈ కారణాలవల్లే ‘మూడు’పై వెనక్కి
- ఇది వ్యూహాత్మకంగా వేసిన వెనుకడుగే!
- అదను చూసి మళ్లీ ముందుకే!
ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆకస్మికంగా దానిని ఉపసంహరించుకోవడం.. సీఆర్డీఏ రద్దు చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆరు నూరైనా మూడు రాజధానులపై ముందుకే వెళ్తామంటూ ముఖ్యమంత్రి మొదలుకొని వార్డు కార్పొరేటర్ వరకు అధికారపక్ష నేతలంతా ఢంకా బజాయిస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం మూడు రాజధానులే మా మాట.. ఏ క్షణమైనా విశాఖ వెళ్లిపోతామన్నారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయురెడ్డి రోజూ దానిపైనే ట్వీట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ప్రభుత్వం ఒక్కసారిగా బిల్లులను ఉపసంహరించుకోవడం చర్చనీయాంశమైంది.
నవంబరు 22న రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ మొదలుపెట్టగానే.. అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ జోక్యం చేసుకుని.. పాలనా వికేంద్రీకరణ- సమగ్రాభివృద్ధి చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని.. కాసేపట్లో శాసనసభలో సంబంధిత బిల్లు ప్రవేశపెడుతుందని నివేదించారు. ఇది ప్రజలకు, రాజకీయ వర్గాలకు తీవ్ర విస్మయం కలిగించింది. దీని వెనుక ఏం జరిగిందా అని అందరూ విశ్లేషించుకున్నారు.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని గత రెండేళ్లుగా రైతులు దీక్ష చేస్తున్నారు. తాజాగా న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ తిరుపతి యాత్ర కూడా చేపట్టారు. 700 రోజులకుపైగా దీక్ష చేస్తుంటే వారిని ఒక్క మంత్రి గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ ఒక్కరంటే ఒక్కరు కూడా వారిని పరామర్శించిన పాపానపోలేదు. పైగా మరింతరెచ్చగొట్టే ధోరణిలో పెయిడ్ ఆర్టిస్టులంటూ నిందాపూర్వాక విమర్శలు చేశారు. వారి దీక్షకు పోటీగా మరో టెంటు వేయించారు.
రాజధాని కోసం పాదయాత్రలు చేస్తుంటే మూడు రాజధానుల కోసం విశాఖ నుంచి పాదయాత్ర అంటూ మరో వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఇంత కఠిన వైఖరితో ఉన్న జగన్ సర్కారు ఇంత ఆకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించడం.. వెనక్కి తగ్గడమా? వ్యూహాత్మక ఎత్తుగడా అన్నది సర్వత్రా చర్చ జరుగుతోంది.
న్యాయ రాజధాని పై సీజే సూటిప్రశ్న
రాజధాని కేసులపై హైకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాల చట్టబద్ధతపైనే విచారణ జరుపుతున్నామని చీఫ్ జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా స్పష్టం చేశారు. హైకోర్టు అమరావతిలో ఉంటే కర్నూలు న్యాయ రాజధాని ఎలా అవుతుందని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘హైకోర్టే లేకుండా న్యాయ రాజధాని ఎలా? కేంద్రం నోటిఫికేషన్ లేకుండా హైకోర్టును కదిలించగలరా? ఇది ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉంది. పాలనా వికేంద్రీకరణ చట్టంలోనే స్పష్టత లేదు. భారతదేశం మొత్తం దేశ ప్రజలందరిదీ. అలాగే.. అమరావతి కేవలం భూములు ఇచ్చిన రైతులకే పరిమితం కాదు. అది… విశాఖపట్నం, కర్నూలు, రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుంది’ అని స్పష్టం చేశారు.
అటు అమరావతికి అనుకూలంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శ్యామ్ దివాన్, బి.ఆదినారాయణరావు తదితరులు బలమైన వాదనలు వినిపిస్తున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలు న్యాయ సమీక్షకు నిలవకపోవచ్చని జగన్‌కు అర్థమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నట్లు భావిస్తున్నారు.
పాదయాత్ర జోరు..
మొన్నమొన్నటి వరకు పెద్దగా స్పందన లేదనుకున్న అమరావతి రైతుల ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకుంది. మహాపాదయాత్రకు గుంటూరు, ప్రకాశం జిల్లా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఎదురేగి స్వాగతం పలికారు. మహిళలు, రైతులకు జేజేలు పలికారు.
13 జిల్లాల నుంచి, పొరుగున కర్ణాటక, తెలంగాణ నుంచి.. చివరకు ఉత్తర భారతం నుంచి కూడా రైతులు తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అసలు యాత్రే జరగకుండా అడ్డుకుందామన్న తమ ప్రయత్నాలు ఫలించకపోగా.. అమరావతిపై ప్రజల నుంచి ప్రభుత్వ వర్గాలు సైతం ఊహించని ప్రతిస్పందన కనిపించింది. దీంతో ప్రభుత్వ పెద్దలకు మతిపోయింది. ఇది మరింత బలపడితే రాజకీయంగా ఎదురుదెబ్బలు తప్పవని జగన్‌కు అవగతమైంది.
రంగంలోకి అమిత్‌షా!
బీజేపీ రాష్ట్ర నేతల్లో కొందరు జగన్‌కు పెయిడ్ ఆర్టిస్టుల్లా పనిచేస్తున్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్ దేవ్‌ధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసీపీ సర్కారుపై ఈగయినా వాలనివ్వడం లేదు. ఇక రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
వైసీపీ అధికారంలో ఉంటే.. చంద్రబాబు పాలన సాగుతున్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. వీరందరికీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టిగా క్లాసు తీసుకున్నారు. గత నెలలో తిరుపతిలో జరిగిన అంతర్గత భేటీలో… అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకు మద్దతివ్వలేదని నిలదీశారు. దానికి ప్రజల మద్దతు లేదని.. ఉద్యమించేది అసలైన రైతులు కాదని.. పెయిడ్ ఆర్టిస్టులని దేవధర్ అనడంతో ఆయనపై విరుచుకుపడ్డారు.
ఆయన వల్లే పార్టీ పరిస్థితి ఇలా తయారైందని.. అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని అని బీజేపీ తీర్మానించిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్‌లను ఎందుకు పార్టీ సమావేశాలు పిలవడం లేదని ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర నేతలంతా కలిసి రాజధాని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. పాదయాత్ర చేస్తున్న ప్రాంతానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు.
అనేక మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకుని, రాష్ట్రంలో పరిస్థితులను తాను స్వయంగా పరిశీలించిన తర్వాతే అమిత్‌షా బీజేపీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. రాజధాని రైతులకు అండగా నిలవాలని సుస్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామం జగన్ సర్కారుకు మింగుడు పడలేదని తెలుస్తోంది. ప్రస్తుత నిర్ణయానికి ఇది కూడా కారణమని చెబుతున్నారు.
ఇక జగన్ తన రాజకీయ గురువుగా భావించే కేసీఆర్ కూడా మూడు రాజధానులతో వైసీపీకి ముప్పని ఆయనకు సూచించినట్లు తెలిసింది. వెంటనే ఉపసంహరించుకోవాలని.. ప్రధాని మోదీ స్వయంగా సాగు చట్టాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించి రైతులకు క్షమాపణ చెప్పారని గుర్తుచేసినట్లు సమాచారం. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల చట్టాలను జగన్ వెనక్కి తీసుకుంటున్నారన్న విషయం కేసీఆర్ సన్నిహితులకు ముందే తెలుసని వెల్లడైంది.
నవంబరు 22 ఉదయాన్నే తెలంగాణ సమాచార హక్కు కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి ఈ దిశగా ట్విటర్లో పోస్టు చేయడమే దీనికి నిదర్శనం. 22న జగన్ ప్రభుత్వం శాసనసభలో డజనుకు పైగా బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిలో మూడు రాజధానుల రద్దు బిల్లును మాత్రమే ఆమోదించారు.
‘వెనుకడుగు’ వ్యూహాత్మకమే…
‘ఇది సర్కారు తాత్కాలికంగా, వ్యూహాత్మకంగా వేసిన వెనుకడుగు మాత్రమే. మూడు రాజధానుల కత్తి వేలాడుతూనే ఉంది’ అని జగన్ వైఖరి తెలిసిన వారు చెబుతున్నారు. ఈ చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు, ఆమోదం పొందిన తీరు న్యాయ సమీక్షలో దొరికిపోయే ప్రమాదం ఉన్నందునే వెనుకడుగు వేశారని, దానిని మరింత పకడ్బందీగా తీసుకొచ్చే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా పాత చట్టాలను రద్దుచేశారని జగన్ అనుకూల వర్గాలు చెబుతున్నాయి.
మరింత సమగ్రంగా కొత్త బిల్లు తీసుకొస్తామని సభలోనే జగన్ ప్రకటించారు. ఇది ఇంటర్వెల్ మాత్రమే అని, శుభం కార్డు పడటానికి చాలా సమయం ఉందని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దీనిని బట్టిచూస్తే… ఎడాపెడా తగులుతున్న ఎదురుదెబ్బల నుంచి తాత్కాలిక ఉపశమనం కోసమే ఈ చట్టాలను ఉపసంహరించుకున్నారని, అదను చూసి.. అనుకూల వాతావరణం ఉందనుకున్నప్పుడు మళ్లీ తెరపైకి తెస్తారని చెబుతున్నారు.
జగన్‌కు అమిత్ షా ఫోన్‌కాల్!
అసలీ చట్టాల రద్దు వెనుక ఏం జరిగి ఉంటుంది? తన పట్టుదలను తగ్గించుకొనేంతగా జగన్‌ను ప్రభావితం చేసినే అంశాలేమిటనే అంశాలపై లోతైన చర్చే నడచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్రంలో నంబర్ టూగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్‌కాల్‌తోనే సీఎం వెనక్కి తగ్గారు.
మూడు రాజధానులపై పునరాలోచించుకోండి.. సమీక్షించుకోండని సలహా ఇచ్చిన ఆయనే.. చివరకు ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో చేసేదేమీలేక, మారు మాట్లాడకుండా జగన్ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఇది నవంబరు 19నే జరగాల్సి ఉండగా.. ఆ రోజు సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన భార్యపై కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిత దూషణలు చేయడంతో నానా రచ్చ జరిగింది. దీనిపై సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడంతో సమయం మించిపోయింది.
ఈ అంశంపై కేంద్రం ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో సోమవారం ఉదయం ముందుగా ఉపసంహరణ విషయాన్ని హైకోర్టుకు తెలియజేశారు. అప్పటి వరకు ఈ విషయం మంత్రివర్గానికి కూడా తెలియదని సమాచారం. ఉదయం 9 గంటలకే అడ్వకేట్ జనరల్‌కు ఈ అంశంపై నోట్ వెళ్లినట్లు తెలిసింది. ముందుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి ముఖ్యమంత్రి కార్యాలయంలోని కీలక అధికారి నుంచి ఈ సమాచారం పంపించినట్లు సమాచారం. ఆ తర్వాతే అర్జంటుగా మంత్రివర్గసమావేశం ఏర్పాటు చేశారు.
సీఎం, ఆర్ధిక మంత్రి ఈ విషయంపై మాట్లాడేవరకు మూడు రాజధానులచట్టం ఉపసంహరణ విషయం ఇతర అమాత్యులకు తెలియదు. అత్యంత విశ్వసనీయవర్గాలు సమాచారం ప్రకారం.. అమరావతి మహాపాదయాత్రపై పోలీసులు లాఠీచార్జి చేయడం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది. నవంబరు 11న ప్రకాశం జిల్లాలో రాజధాని రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలు, వృద్ధులన్న విచక్షణ కూడా లేకుండా కొట్టారు. పలువురు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన జరిగే నాటికే రాష్ట్రంలో కేంద్ర నిఘా బృందాలు (ఐబీ టీమ్స్) ఇక్కడ ఉన్నాయి.
14వ తేదీన తిరుపతిలో జరిగిన దక్షిణ ప్రాంతీయ సదస్సు కోసం 13వ తేదీన అమిత్‌షా తిరుపతికి వచ్చారు. ఈ సదస్సు నిర్వహణ, సెక్యూరిటీ, ఇతర అంశాల పరిశీలనకు ఐబీ టీమ్స్ ఈనెల 10 నుంచే తిరుపతితోపాటు పలు ప్రాంతాల్లో మకాం వేశాయి. ఈ నేపఽథ్యంలో 11న రైతుల యాత్రపై జరిగిన లాఠీచార్జి, అనంతర పరిణామాలను కేంద్ర హోం శాఖకు నివేదించాయి. ఆ తర్వాత కేంద్రం నుంచి ఆదేశాలతో ఓ బృందం రైతుల పాదయాత్రను స్వీయపరిశీలన చేసినట్లు తెలిసింది.
యాత్ర ఎలా జరుగుతోంది.. ఎవరు నిర్వహిస్తున్నారు.. యాత్రకు లభిస్తున్న స్పందన, పోలీసులు, అధికారుల తీరు, వసతి, బస వంటి అనేక అంశాలపై నివేదికలు వెళ్లాయి. ఏం జరిగిందో ఏమో.. సదస్సు ముగిసిన తర్వాత 15వ తేదీన అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వంలోని ఓ ప్రముఖ న్యాయవాదితో షా మాట్లాడినట్లు తెలిసింది. హైకోర్టులో విచారణలో ఉన్న అమరావతి రైతుల కేసు పరిస్థితిపై ఆరాతీసినట్లు తెలిసింది. ‘విచారణ పూర్తిగా సాంకేతిక అంశాలపై నడుస్తోంది. చట్టంలో అనేకానేక అంశాలు సాంకేతికంగా లోపభూయిష్టంగా ఉన్నాయి. వాటి ఆధారంగా ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవచ్చు. ఇదే విషయాన్ని పలు సార్లు చెప్పినా.. వినిపించుకోవడం లేదు. కేసు గెలుస్తామన్న ధీమాలోనే ఉన్నారు’ అని సదరు న్యాయవాది నివేదించినట్లు తెలిసింది.
ఆ తర్వాత 17వ తేదీన షా జగన్‌కు ఫోన్‌చేసి ఇదే అంశంపై చర్చించారని.. మూడు రాజధానుల చట్టంపై పునఃపరిశీలన చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే అసెంబ్లీ సమాశాలు మొదలయ్యాయి. 19న షా మళ్లీ సీఎంకు ఫోన్ చేశారు. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. సరిగ్గా అదే రోజున మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రకటించారు.
సమర్థించుకోలేక..
సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరిస్తూ.. తమ నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విశ్వప్రయత్నం చేశారు. వారి ప్రసంగాల్లో అనేక తడబాట్లు, కప్పదాట్లు స్పష్టంగా బయటపడ్డాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ రాజధానిగా ఉండగా బిహెచ్ఈఎల్, ఐడీపీఎల్ వంటి అనేక పరిశ్రమలు వస్తే వాటిని హైదరాబాద్ చుట్టూనే ఏర్పాటుచేశారని, ఇతర రాషా్ట్రల్లో మాత్రం రాజధానికి దూరంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చే శారని బుగ్గన సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు.
రాజధాని పరిశ్రమలు అన్నీ హైదరాబాద్‌లోనే రావడం వల్ల సమస్యలు తలెత్తాయని, అందుకే అధికార వికేంద్రీకరణ చేయాలనుకున్నామని జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్, శివరామకృష్ణన్ కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు, జీఎన్‌రావు కమిటీ ఇదే చెప్పాయని అన్నారు.
హైదరాబాద్‌లో అటు రాజధాని, ఇటు పరిశ్రమలు కేంద్రీకృతమయ్యాయని చెప్పిన బుగ్గన విభజిత ఆంధ్రప్రదేశ్‌లో భారీ పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విస్లృంగా ఉన్న విశాఖలోనే పాలనా రాజధాని పెడతామన్నారు. అంటే, ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధిచెందిన విశాఖలోనే మళ్లీ రాజధాని పెట్టడం అంటే హైదరాబాద్ చరిత్ర పునరావృతం అయినట్లే కదా! ఇక అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడ అంటూ అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో చర్చ బయల్దేరింది.
హైదరాబాద్ తరహా సూపర్ కేపిటల్ మోడల్ వద్దనుకున్నామని, అందుకే మూడు రాజధానులు పెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అదే సమయంలో విశాఖలో అన్నీ వసతులు ఉన్నాయని, ఆ నగరానికి మరి కాస్తా మద్దతు ఇస్తే హైదరాబాద్‌తో పోటీపడుతుందని కూడా అనేశారు. అంటే, హైదరాబాద్ తరహా కేంద్రీకృత తరహా అభివృద్ధి వద్దంటూనే, విశాఖను హైదరాబాద్ స్థాయికి తీసుకెళ్తామని సీఎం చెప్పడం కప్పదాటు వైఖరిగా అభివర్ణిస్తున్నారు.