దసరా నాడు జాతీయ పార్టీ ప్రకటించబోతున్న సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, ప్రజలకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్…కాటేసే నక్కలా మారిపోయారని షాకింగ్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్ నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జాతీయ రాజకీయాలంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ వస్తే…టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ తప్పదని, ఎవడబ్బ సొమ్ముతో సొంత విమానం కొంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఎమ్మెల్సీ కవితపై కూడా మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఎత్తుకునే బతుకమ్మ లోపల కూడా లిక్కర్ బాటిల్ ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలోని కొందరు వెలమ కులస్తులతో కేసీఆర్ భేటీ అవుతున్నారని, తన కుల సామ్రాజ్య విస్తరణకు ఈ ప్రయత్నాలని దుయ్యబట్టారు. గతంలో ఏపీని తిట్టిన కేసీఆర్… ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీకి వెళ్తారని ప్రశ్నించారు.
దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలున్నాయని, ఆ రాష్ట్రాల్లో మరో ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదని అన్నారు. కేసీఆర్ చెబుతున్న ప్రత్యామ్నాయం దండగని, తన అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకు పంజాబ్ రైతులకు కేసీఆర్ ఆర్ధిక సాయం చేశారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కు ఓటమి తప్పదని, రాజ్యాధికారం కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మధు యాష్కీ మండిపడ్డారు.
కాగా, దసరా రోజున జాతీయపార్టీ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటన చేయనున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చబోతున్నారుని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకారం రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే 283 మంది ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేయనున్నారని తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపారు. జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కేసీఆర్ ఆ సమావేశంలో వివరించనున్నారు.