జగనన్న రావాలి.. సీఎం కావాలి!
అనే నినాదాన్ని పరుగులు పెట్టించిన నాయకులే..
ఇప్పుడు వైసీపీ వద్దు.. జగన్ పొడ అసలే వద్దు!!
అనే వ్యాఖ్యలు చేస్తున్నారా?
ఒకప్పుడు టీడీపీ కంటే.. వైసీపీ బెటర్ అంటూ..సైకిల్ దిగి.. ఫ్యాన్కిందకు చేరిపోయిన నాయకులే ఇప్పుడు వీలు చూసుకుని బయటకు వచ్చేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారా? ఇక, చాలు.. ఉండలేం! అని కుండబద్దలు కొడుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఒకటి చోట కాదు.. ఒక నియోజకవర్గం కాదు.. దాదాపు 10 నుంచి 15 నియోజకవర్గాల్లో ఇదే మాట వినిపిస్తోంది.
టీడీపీ నుంచి వెళ్లిన వారే కాదు.. సంస్థాగతంగా వైసీపీలో ఉన్నవారు కూడా ఇప్పుడు ఇదే మాట చెబుతు న్నారు. ఆయా నియోజకవర్గాల్లో జగన్ అవలంభిస్తున్న తీరు.. వైసీపీ ఎమ్మెల్యేలను క్రమశిక్షణలో పెట్టలేక పోతున్న విధానంతో కీలక నాయకులు.. ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి త్యాగం చేసిన నేతలు కూడా ఇప్పుడు పార్టీ మారిపోయేందుకు .. తిరిగి సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని చోట్ల బీజేపీ వైపు చూస్తున్న నాయకులు కూడా కనిపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుండడం గమనార్హం. కావలిలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి.. జగన్‌పై అభిమానంతో టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే, ఇప్పుడు ఆయనను ఇక్కడ పట్టించుకునేవారే లేకుండా పోయారు. పైగా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దూకుడు ఎక్కువగా ఉంది. దీంతో వంటేరు తిరిగి.. సైకిల్ ఎక్కేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. కొన్నాళ్ల కిందట ఇదే జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన బీద మస్తాన్ రావుకు రాజ్యసభ సీటు ఇస్తానన్న జగన్ ఇవ్వలేకపోయారు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపం తో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీ దిశగా దృష్టి పెట్టారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. వచ్చే ఎన్నికల వరకు కూడా వైసీపీలో ఉండే పరిస్థితి లేదని తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే.. ఈయన కూడా జంప్ చేసేందుకు రెడీ అవుతున్న బ్యాచ్‌లోనే ఉన్నారు.
కర్నూలులో మాజీ ఎంపీ బుట్టా రేణుక.. బీజేపీలోకి జంప్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆమె విద్యాసంస్థల వ్యాపారాల రీత్యా.. బీజేపీవైపు చూస్తున్నారని రెండు మూడు నెలలుగా ప్రచారంలో ఉంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తీవ్ర అసహనంతో ఊగిపోతున్నారు. ఈయనను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. త్వరలోనే ఈయన కూడా ఏదో ఒక టి తేల్చుకునే అవకాశం కనిపిస్తోంది. విజయవాడలో మాజీ మేయర్.. తాడి శకుంతల త్వరలోనే బీజేపీలోకి జంప్ చేస్తారని అంటున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు సొంత పార్టీ నిరాదరణతో తీవ్ర అసంతృప్తి.. అసహనంతో ఉన్నారనేది చర్చనీయాంశంగా మారుతున్నా.. అధినేత జగన్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు. దీంతో త్వరలోనే సదరు నేతలు జంపింగులకు రెడీ అవుతున్నారనే అంశం .. చర్చనీయాంశంగా మారడం గమనార్హం.