గతంలో ఎన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్…”మా” ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. “మా”అధ్యక్షుడి బరిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నానని ప్రకటించడం, తన ప్యానెల్ పేర్లు వెల్లడించడంతో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ విమర్శలు రావడం….ఆ తర్వాత ఇండస్ట్రీ వర్గాలుగా విడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ ఉన్న కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియకముందే ఎన్నికలంటూ ప్రకటనలు చేయడంపై విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే “మా” ఎన్నికల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తాజాగా మా ఎన్నికల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది. ఆన్లైన్ లో నిర్వహించిన మా కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 22న మా జనరల్ బాడీ సమావేశం, సెప్టెంబర్ 12న “మా” అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది.
తాజాగా మా కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలంటూ కృష్ణంరాజుకు వారు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సమావేశం నిర్వహించిన రెబల్ స్టార్…కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, “మా” అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీంతో, ఈ సారి పోరు రసవత్తరంగా మారింది.
అయితే, ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పలువురు సీనియర్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై ఆగస్టు 22న జరగనున్న జనరల్ బాడీ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే చాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా, ఎన్నికల డేట్ ఫిక్స్ చేసి సభ్యులందరితో పెద్దాయన కృష్ణం రాజు మ”మా” అనిపించారని చెప్పుకుంటున్నారు.