రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ను ఆయన తరఫు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కలిశారు. జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన లూథ్రా…కేసులకు సంబంధించిన వివరాలు, తదుపరి కార్యాచరణ, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించారని తెలుస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడలేదు. ఆ తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులను లూథ్రా కలిశారు. చంద్రబాబుతో ములాఖత్‌కు సంబంధించిన వివరాలను వారికి వెల్లడించారు. సాయంత్రం గం.6.30 ఫ్లైట్ కు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
అంతకుముందు, ఈ చంద్రబాబు కేసులపై హైకోర్టులో లూథ్రా వాడీవేడీ వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, లాయర్ పోసాని వాదనలు వినిపించారు. ఏపీ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్-13 ఐపీసీ 409 చెల్లవని క్వాష్ పిటిషన్లో చంద్రబాబు తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. దీంతో, చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీకి హైకోర్టు షాకిచ్చింది. ఈ నెల 18 వరకు చంద్రబాబును కస్టడీకి కోరవద్దని, ఎటువంటి విచారణ జరపవద్దని సీఐడీని ఆదేశించింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీ అధికారులను కోర్టు ఆదేశించింది.
ఇక, క్వాష్ పిటిషన్ పై విచారణ జరపాలని చంద్రబాబు తరఫు లాయర్ల కోరగా…హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. 17 ఏ సెక్షన్ ప్రకారం చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలని, దానిపై వాదనలు వినాలని లూథ్రా పట్టుబట్టారు. ఏపీ సీఐడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకుండా ఎలా విచారణ జరుపుతామని లూథ్రాను ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ అభ్యంతరాలుంటే ఈ కేసును వేరే బెంచ్‌కు మారుస్తామని తెలిపింది. గతంలో తాను పీపీగా చేశానని, అభ్యంతరాలుంటే చెప్పాలని హైకోర్టు జడ్జి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అయితే, తనకు అభ్యంతరం లేదని లూథ్రా చెప్పారు. సెప్టెంబరు 19న చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.