పెట్టబడుల కోసం దేశ దేశాలు తిరిగి అక్కడి వారితో భేటీ కావటం.. రాష్ట్రానికి భారీ ప్రాజెక్టుల్ని తీసుకురావటం కొన్నేళ్లుగా వస్తున్నదే. అయితే.. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న రోజుల్లో విదేశాలకు పెట్టుబడులకు వెళ్లటం అవమానకరంగా.. ఆత్మగౌరవానికి నష్టం వాటిల్లే చర్యగా అభివర్ణించేవారు. మారిన కాలానికి తగ్గట్లు.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రులు దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనం చూస్తున్నదే. ఇలాంటి వేళలో.. ఏపీ కి వచ్చిన ఒక ప్రముఖ గ్రూప్ లులు.. దాదాపు రూ.2వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం తెలిసిందే.
విశాఖపట్నంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్.. షాపింగ్ మాల్.. ఫైవ్ స్టార్ హోటల్ కట్టేందుకు ముందుకు వచ్చిన ఆ గ్రూప్ నకు చంద్రబాబు హయాంలో 13.82 ఎకరాల్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. ఆ గ్రూప్ ఏపీని వదిలేసి వెళ్లిపోయింది. అలా వెళ్లిన ఆ గ్రూప్ ను పెద్దగా పట్టించుకోలేదు. అలా ఎలా వెళ్లిపోతారేంటి? మీకేం కావాలని అడిగింది లేదు. ఏపీలో పెట్టుబడులు పెట్టమంటూ తమిళనాడు వెళ్లిపోయిన ఆ గ్రూప్ అక్కడ పెడుతున్న పెట్టుబడుల్ని చూసినప్పుడు మాత్రం.. అరేరె.. ఏపీ ఎంతటి అవకాశాల్ని మిస్ చేసుకుందన్న భావన కలుగక మానదు.
యూఏఈకి చెందిన ఈ గ్రూప్.. తమిళనాడులో ఇప్పటివరకు రూ.3వేల కోట్ల వరకు భారీ పెట్టుబడులు పెట్టింది. ఇందులో భాగంగా కోయంబత్తూరులో ఆ సంస్థ 1.1 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైపర్ మార్కెట్ ను నిర్మించింది. త్వరలో చెన్నైలో భారీ షాపింగ్ మాల్ నిర్మిస్తామని.. మెట్టుపాళ్యం.. ఓట్టన్ సత్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు.. తంజావూరులో రైస్ మిల్లు ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది.
అంతేకాదు.. తమిళనాడు నుంచి ఆహార ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేందుకు అంతర్జాతీయ లాజిస్టిక్స్ హబ్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా పేర్కొంది. ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తి అయితే దాదాపు పదివేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. వేలాది కోట్ల పెట్టుబడులు.. ఉపాధి అవకాశాల్ని ఏపీ ఎందుకు పోగొట్టుకుంది? తమిళనాడు ఎందుకు లబ్థి పొందిందన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఏపీలో లులు పెట్టుబడులు పెట్టకపోవటంతో ఆ సంస్థకు జరిగిన నష్టంతో పోలిస్తే.. ఏపీకే ఎక్కువ లాస్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.