కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. డెల్టా వేరియంట్ నుంచి కోలుకోక ముందే జనాన్ని ఒమిక్రాన్ చుట్టుముట్టేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డెల్టా లేదా ఒమిక్రాన్…వేరియంట్ ఏదైనా సరే కోవిడ్ బారిన పడి కోలుకున్న తర్వాత కొందరిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోవిడ్ సోకిన పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గిపోతోందని ఓ అధ్యయనంలో వెల్లడి కావడంతో పురుషుల్లో కలవరం మొదలైంది.
కరోనాబారిన పడి కోలుకున్న తర్వాత 3 నెలల వరకు వీర్యంలో శుక్రకణాల సంఖ్య , వాటి కదలిక తక్కువగా ఉంటోందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనంలో వెల్లడైంది. కరోనా నుంచి కోలుకొన్న 150 మంది పురుషులపై అధ్యయనం చేసిన తర్వాత ఈ వివరాలను వెల్లడించింది. ఆ పురుషుల్లో శుక్రకణాల సంఖ్య 37% తగ్గిందని, శుక్రకణాల కదలిక 60% తగ్గిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 3 నెలల తర్వాత ఆ కణాల సంఖ్య సాధారణ స్థాయికి చేరుకుంటున్నట్టు తెలిపారు.
పడిపోతున్న స్పెర్మ్ కౌంట్లను మానవ మనుగడకు ముప్పుల జాబితాలో చేర్చాలని ఎపిడెమియాలజిస్ట్ లు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని ధృవీకరించడానికి పురుషులలో శాశ్వత నష్టం జరిగిందో లేదో తెలుసుకోవడానికి తదుపరి అధ్యయనాలు జరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అయితే, తేలికపాటి లక్షణాలు ఉన్నవారి స్పెర్మ్ నాణ్యతలో పెద్దగా తేడాలు కనుగొనలేదని పరిశోధకులు చెబుతున్నారు.