ఇప్పటికే అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లకు పూర్తి భిన్నమైన టీకానున త్వరలో తీసుకురానుంది హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఇ సంస్థ. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ధరలకు భిన్నంగా.. అతి చౌకగా ఈ టీకాను తీసుకురానున్నారు.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు డోసులు కలిపి కేవలం రూ.500లకు లభించేలా ఈ టీకాను ప్లాన్ చేస్తున్నారన్న మాట ఇప్పడు సంచలనంగా మారింది.
ప్రస్తుతం మూడో దశ పరీక్షల్ని చేపట్టిన ఈ వ్యాక్సిన్ తొందర్లోనే మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు. చౌక అన్నట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ టీకా పని తీరు.. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న వ్యాక్సిన్లకు పూర్తి భిన్నమైనదన్న మాట మరింత ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు.. అవి పని చేసే తీరును చూస్తు.. ఫైజర్.. మోడెర్నా టీకాలు ఎంఆర్ఎన్ఏ (MRNA) కోవకు చెందితే.. కొవిషీల్డ్, జాన్సన్ అండ్ జాన్సన్.. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు వైరల్ వెక్టర్ తరహాకు చెందినవి.
ఇక..కావాగ్జిన్.. సినోవ్యాక్.. వెరోసెల్ వ్యాక్సిన్లు ‘సినో ఫార్మ్’ యాక్టివేటెడ్ రకానికి చెందినవి. బయోలాజికల్ ఇ సంస్థ తీసుకొస్తున్న ‘‘కార్బె వాక్స్’’ వీటన్నింటికి భిన్నమైన పని తీరుతో ఉంటుందని చెబుతున్నారు. ఆ మాటకు వస్తే.. ఈ తరహా టీకా ఇప్పటివరకు లేదని.. ఇదే మొదటిదని చెబుతున్నారు.
ఇంతకూ దీని పని తీరు ఎలా సాగుతుంది? దీన్ని ఎలా డెవలప్ చేశారన్న విషయంలోకి వెళితే.. గడిచిన కొన్ని దశాబ్దాలుగా హెపటైటిస్-బి వ్యాక్సిన్ల తయారీకి వినియోగిస్తున్న పరిజ్ఞానాన్ని కొవిడ్ టీకా తయారీలోనూ వినియోగిస్తున్నారు.
కరోనావైరస్ కు ఆయువుపట్టు.. వైరస్ ఉపరితలం మీద ఉండే స్పైక్ ప్రొటీన్. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా.. ఈ స్పైక్ ప్రోటీన్ తోనే రిసెప్టర్ బైండింగ్ డొమైన్ ప్రోటీన్ సబ్ యూనిట్ రకానికి చెందిన టీకాను డెవలప్ చేశారు. ఆర్ బీడీ టీకాతో ఈ స్పైక్ ప్రోటీన్ ను మనిషి శరీరంలోకి పంపుతారు.
రోగ నిరోధక వ్యవస్థ దీన్ని చూసి నిజమైన కరోనా వైరస్సే అనుకొని వెంటనే స్పందిస్తుంది. దాన్ని తిప్పి కొట్టే యాంటీబాడీల్ని విడుదల చేస్తుంది. ఈ రియాక్షన్ ను రోగనిరోధక వ్యవస్థలోని మెమొరీ సెల్స్ తమలో నిక్షిప్తం చేసుకుంటాయి.
ఈ టీకా వేసుకున్న తర్వాత నిజమైన కరోనా వైరస్సే శరీరంలోకి ప్రవేశిస్తే.. గతంలో దాన్ని ఎదుర్కొన్న అనుభవంతో తక్షణమే బలమైన రోగ నిరోధక శక్తిని విడుదల చేసేలా రియాక్టు అవుతుంది. దాంతో వైరస్ కు అడ్డుకట్ట పడుతుంది.
బయోలాజికల్ ఈ ఇదే సూత్రం మీద తన వ్యాక్సిన్ వర్క్ అయ్యేలా రూపొందించారు. ఇప్పటివరకు ఈ విధానంతో అమలయ్యే టీకా ‘‘కార్బెవాక్స్’’ గా చెబుతున్నారు. వినేందుకు ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.