కొండంత ధైర్యాన్ని కరోనా మింగేసింది.. ఆమె గుండె ఆగిపోయింది.. కరోనా కేసులు.. మరణాలు దేశానికి కొత్తేం కాదు. కాసింత ఒంట్లో బాగోలేదన్నంతనే ఆగమాగం చేసేటోళ్లను చాలామందినే చూస్తుంటాం. తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా.. నాకేం ఫర్లేదు.. మీరేం కంగారుపడకండంటూ ధీమాగా చెప్పేటోళ్లు చాలా తక్కువమంది కనిపిస్తారు.
క్రిటికల్ కండీషన్లో ఉంటూ కూడా.. తనలాంటి ఎంతో మంది కరోనా రోగులకు కొత్త స్ఫూర్తిని.. ఉత్సాహాన్ని మాత్రమే కాదు.. కోలుకుంటాం.. మరేం ఫర్లేదన్న ధైర్యాన్ని కల్పించిన ఒక ధీర యువతిని కరోనా మహమ్మారిని కబళించి వేసింది.
ఆమె గుండె చప్పుడ్ని శాశ్వితంగా ఆపేసింది.
వారం క్రితం ఢిల్లీకి చెందిన డాక్టర్ మోనిక తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేశారు. అందులో 30 ఏళ్ల మహిళ ఒకరు.. చేతికి సెలైన్ పైపు.. నోటికి ఆక్సిజన్ పైపు పెట్టుకొని.. కరోనా ఐసీయూ వార్డులో ఉండి కూడా.. దిగాలుగా ఉండిపోకుండా లవ్ యూ జిందగీ పాటల్ని వింటున్న వైనం.. తనకేం కాదన్న ధీమాను ప్రదర్శించి ఎందరి మనసుల్ని దోచేసింది.
అలాంటి ఆమె తాజాగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
కరోనాకు భయపడకుండా ధైర్యంగా ఉన్నప్పటికి ఆమె గుండె మాత్రం పని చేయటం ఆపేసింది.
ఆమె పరిస్థితి క్రిటికల్ గా మారటంతో ఆమె తుదిశ్వాస విడిచినట్లుగా డాక్టర్ మోనిక ఆమె మరణవార్తను తెలియజేశారు.
‘‘ఒక ధైర్యమైన గుండెను కోల్పోయాం.. చాలా బాధాకరం’’ అంటూ ఆమె మరణవార్తను ప్రపంచానికి తెలియజేశారు.
వారం క్రితం వీడియోను చూసిన ఆమెను.. చాలామంది త్వరగా కోలుకొని సంతోషంగా బయటకు రావాలని కోరుకున్నారు.
అలాంటిది ఆమె ఎప్పటికి తిరిగిరాలేని లోకాలకు చేరుకుందన్న విషయం తెలిసిన వెంటనే షాక్ తింటున్నారు. కరోనా మరీ ఇంత కసాయితనంతో వ్యవహరించటమా అని మండిపడుతున్న వాళ్లు లేకపోలేదు.
తన ధీరత్వంతో జాతి జనుల మనసుల్ని గెలుచుకున్న ఆ యువతి.. తాజాగా దేశం చెక్కిలి మీద కన్నీటి చారలా మారిందనటంలో సందేహం లేదు. వి మిస్ యూ!