ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే సినిమా చూడరు ప్రేక్షకులు. అందుకే తమ సినిమాలకి ఎవరూ ఊహించని స్పెషల్ టచ్ ఏదైనా ఇవ్వాలనుకుంటారు దర్శక నిర్మాతలు. అయితే చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ విషయంలో ఈ తపన కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.
మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ చాలా డెప్త్ ఉన్న స్టోరీ. మోహన్‌లాల్, మంజు వారియర్ లాంటి గ్రేట్ యాక్టర్స్ నటించడమే కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్ హీరో డైరెక్ట్ చేయడం, ఆయన ఓ గెస్ట్ రోల్ కూడా నటించడం సినిమాకి ఎంతో ప్రత్యేకతను తీసుకొచ్చింది. దాంతో తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’ని అంతకు మించి స్పెషల్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు డైరెక్టర్ మోహన్ రాజా.
ఒరిజినల్లో మంజు వారియర్ చేసిన పాత్రకి నయనతారని తీసుకోవాలనుకున్నా కుదరలేదు. దాంతో శోభనను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక పృథ్విరాజ్ చేసిన పాత్రకి తెలుగు హీరోలనెవరినీ కాదు.. బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ క్యారెక్టర్ హీరోకి నమ్మకమైన అనుచరుడిగా, ఎంతో వినయంగా కనిపిస్తుంది. హీరో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా వచ్చి సాయపడుతుంది.
కానీ సల్మాన్ లాంటి స్టార్ టాలీవుడ్‌కి వచ్చి ఇక్కడి హీరోకి గులామ్‌గా కనిపించడమనేది జరిగే పని కాదని ఎవరైనా చెబుతారు. అందుకే ఆ క్యారెక్టరైజేషన్‌ని కాస్త చేంజ్ చేశారట. మరింత డిఫరెంట్‌గా మలిచారట. అతని పాత్రకి సినిమాలో ఓ ప్రత్యేకత ఉంటుందట. తనపై ఓ సాంగ్ కూడా ఉంటుందని టాక్.
ఇక ఈ సినిమా కోసం వరల్డ్ ఫేమస్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఓ పాట పాడనుందని తెలిసింది. ఈ సలహా మెగాస్టార్ ఇచ్చారని, ప్రస్తుతం తమన్ ఆమెతో చర్చలు నడుపుతున్నాడని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో యాక్ట్ చేయడమే పెద్ద విశేషమంటే, ఏకంగా బ్రిట్నీతో పాట పాడించడమనేది మరీ పెద్ద విషయం. ఇవన్నీ చూస్తుంటే ‘గాడ్‌ఫాదర్’ని మరో రేంజ్‌కి తీసుకెళ్లేందుకు టీమ్ శక్తివంచన లేకుండా కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది.