టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్ తాజాగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు సంధించారు. తాను చేపట్టిన పాదయాత్ర.. వైసీపీకి అంతిమ యాత్రగా మారుతుందని నిప్పులు చెరిగారు. యువగళం పాదయాత్రతో వైసీపీ అంతిమ యాత్ర మొదలైందని మండిపడ్డారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. 18వ రోజు నగరి నియోజకవర్గం చినరాజకుప్పం నుంచి ప్రారంభమైంది. పాదయాత్రకు ముందు చినరాజకుప్పం విడిది కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు.
తాను చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని.. దీనిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అడ్డుకోవటానికి వెయ్యిమంది పోలీసులను మోహరించారని మండిపడ్డారు. సీఎం జగన్ రెడ్డి మూడున్నరేళ్లలో తన మైకును తొలగించడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. పదో తరగతి తప్పిన జగన్కు ఇంత తెలివితేటలుంటే.. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన తనకెంత తెలివి ఉండాలని లోకేష్ వ్యాఖ్యానించారు.
లక్ష కోట్ల రూపాయలు దోచేసి జైలుకు వెళ్లిన జగన్ పాదయాత్ర చేస్తే.. అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు సృష్టించలేదని గుర్తుచేశారు. తాను పాదయాత్ర చేస్తే ఇన్ని ఆంక్షలా అని లోకేష్ సర్కారును ప్రశ్నించారు. తన పాదయాత్రను ఆడ్డుకోవడంపై చూపిన శ్రద్ధ.. పోలీసులు ప్రజల భద్రతపై పెట్టాలని హితవు పలికారు. జగన్ పాలనలో కానిస్టేబుల్ కు రూ.75 వేలు, ఎస్ఐకి రూ.90వేలు, సీఐకి లక్ష రూపాయలు బకాయి పెట్టారని ఆరోపించారు.
బాబాయి వివేకాను చంపిన కేసులో సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డి పీఏను సీబీఐ విచారించిందని.. కేసుల నుంచి బయటపడటానికి ప్రత్యేక హోదాను అడగటం లేదని.. నారా లోకేష్ విమర్శించారు. కంత్రీ జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. టీడీపీ హయాంలో ఉద్యోగులకు పీఆర్సీతో పాటు జీతాలు సకాలంలో వచ్చాయని.. కంత్రీ జగన్ పాలనలో జీతాల కోసం దేవుడిని చూడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. కాగా, 18వ రోజు కూడా పాదయాత్రలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యువత సెల్ఫీల కోసం ఎగబడ్డారు. మహిళలు దారి పొడవునా హారతులు పట్టారు. అయితే.. కేవలం ఒక కిలో మీటరు మాత్రమే లోకేష్ పాదయాత్ర చేశారు.