టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ఉదయం కుప్పంలో ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం 10.15 గంటలకు కుప్పంలోని సుప్రసిద్ధ వరదరాజుల స్వామి ఆలయంలో లోకేశ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉదయం 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల పాటు మేర ఈ సుదీర్ఘ పాదయాత్ర సాగనుంది.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు యువగళం బహిరంగ సభలో లోకేశ్ పాల్గొంటారు. సభ పూర్తయిన తర్వాత ఓల్డ్ పేట్ మసీదులో ప్రార్థనలు చేసి ముస్లిం మైనారిటీ నేతలతో లోకేశ్ సమావేశం అవుతారు.ఆ తర్వాత కుప్పం బస్టాండ్, టీడీపీ కార్యాలయం, ట్రాఫిక్ ఐల్యాండ్ జంక్షన్, కుప్పం ప్రభుత్వాస్పత్రి క్రాస్ రోడ్, శెట్టిపల్లి క్రాస్ల మీదుగా పీఈఎస్ కళాశాల వరకు తొలిరోజు లోకేశ్ పాదయాత్ర 8.5 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.
కుప్పంలో రెండో రోజు పాదయాత్ర ఈ నెల 28న పీఈఎస్ కళాశాల నుంచి శాంతిపురంలోని అరిముతనపల్లి వరకు సాగనుంది. ఇక, మూడో రోజు యాత్ర ఈ నెల 29న అరిముతనపల్లి నుంచి చెల్డిగానిపల్లె వరకు జరగనుంది. కుప్పంలో 3 రోజుల పర్యటన నేపథ్యంలో మొత్తం 29 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది.
ఈ క్రమంలోనే లోకేశ్ క్యారవాన్ సకల సౌకర్యాలతో యాత్ర చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 400 రోజుల పాటు లోకేశ్ ఈ క్యారవాన్ లోనే బస చేయనున్నారు. అందుకే, అన్ని రకాల సౌకర్యాలు, వసతులతో దీనిని రూపొందించారు. అత్యాధునిక హంగులతో రూపొందించిన ఈ క్యారవాన్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక, లోకేశ్ కు సంఘీభావంగా రాష్ట్రంలోని పలువురు తెలుగు తమ్ముళ్లు యువగళం క్యారవాన్ తరహాలోనే తమ కార్లు, వాహనాలకు స్టిక్కరింగ్ చేయించుకొని యాత్రలో పాల్గొనబోతున్నారు.