టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మోదుగులపాలెంలో లోకేష్ ప్రసంగాన్ని పోలీసులు అడ్డుకున్నారు. లోకేష్ నిలబడిన స్లూల్ ను లాగేసే ప్రయత్నం చేసిన పోలీసులపై టీడీపీ శ్రేణులు తిరగబడ్డాయి. దీంతో, కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జగన్ వికృత చేష్టలకు తాను భయపడబోనని చెప్పారు.
తాను మాట్లాడకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, మర్డర్లు, మానభంగాలు చేసే వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు తనను అడ్డుకోవడం ఏమిటని లోకేష్ మండిపడ్డారు. జగన్ ఆగడాలు శ్రుతిమించాయని, శాంతియుతంగా గాంధేయ మార్గంలో చేస్తున్న పాదయాత్రను అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబును చూస్తే కంపెనీలు గుర్తొస్తాయని జగన్ ను చూస్తే జైలు గుర్తొస్తుందని సెటైర్లు వేశారు. జగన్ అరాచకాలకు తాను భయపడనని, పరదాలు కట్టుకొని ప్రజల్లోకి తాను రావడంలేదని చురకలంటించారు.
రైతులు, ప్రజలు రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు రావాలని… ‘బాబు రావాలి-బాధలు’ పోవాలి అని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రవేశపెట్టిన 120 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి ఘటనపై లోకేష్ మండిపడ్డారు. వైసీపీ మూకల్లాగా తాము తెగిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక్క వైసీపీ కార్యాలయం కూడా మిగలదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు వల్లే తాము సహనంతో ఉంటున్నామని, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నామని చెప్పారు. వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసింది టీడీపీ ఆఫీసు కాదని, రాష్ట్రాన్ని…ప్రజాస్వామ్యాన్ని అని లోకేష్ విమర్శలు గుప్పించారు. ఆ దాడి చేసిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తమకు పౌరుషం లేదనుకోవద్దని, సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. తమ సహనం నశించిన రోజు కడ్రాయర్లతో రోడ్లమీద ఊరేగిస్తామని గుర్తుంచుకోండి అంటూ లోకేష్ అల్లరి మూకలకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.