టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 200 రోజులు పూర్తి చేసుకుంది. 2700 వందల కిలోమీటర్ల మేర పాదయాత్రను లోకేష్ 200 రోజులలో పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో గిరిజనులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సైకో జగన్ నాలుగేళ్ల పాలన ప్రజల పాలిట ఎంత నరకంగా మారిందో తాను ప్రత్యక్షంగా చూశానని లోకేష్ అన్నారు.
సకల వర్గాల ప్రజలు వైసీపీ కాలకేయుల బాధితులేనని లోకేష్ ఆరోపించారు. 200 రోజులపాటు 2700 కిలోమీటర్ల పాదయాత్ర తనకు జగమంత కుటుంబాన్ని అందించిందని లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. ఏ ఊరు వెళ్లినా తమ సొంత మనిషిలాగా అక్కడి ప్రజలు తనను ఆదరించారని, పట్టణాలకు చెందిన ప్రజలు తనకు ఘన స్వాగతం పలికారని గుర్తు చేసుకున్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా యువగళం విజయవంతంగా ప్రజాగళంగా మారిందని అన్నారు. జగన్ అరాచక పాలనతో ధ్వంసమైన రాష్ట్ర దుస్థితి తనలో కసిని రగిల్చిందని లోకేష్ అన్నారు.
ప్రజలు పడుతున్న బాధలకంటే తన భుజం నొప్పి పెద్దగా బాధించడం లేదని, కాళ్లు బొబ్బలెక్కినా జనాల కన్నీళ్ల కంటే అవి ఎక్కువ కాదని పాదయాత్రని కొనసాగిస్తున్నానని లోకేష్ చెప్పారు. కోట్లాది గొంతుకలు ఒక్కటై సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినదిస్తున్నాయని లోకేష్ అన్నారు. లక్షలాది మంది తనతో సెల్ఫీలు దిగారని, వేలాది మంది తమ సమస్యలు తనతో చెప్పుకున్నారని లోకేష్ అన్నారు. వైసీపీ రాక్షస ముూకలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా తన గమ్యం వైపు నడిపిస్తున్న ప్రజలందరికీ లోకేష్ ధన్యవాదాలు చెప్పారు.
తన యువగళం: పాదయాత్ర నిర్విరామంగా, నిరాటంకంగా కొనసాగేందుకు కృషి చేస్తున్న ప్రజలు, టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, యువగళం కమిటీలు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, మీడియా మిత్రులు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని లోకేష్ ఎమోషనల్ గా ప్రసంగించారు. వీరందరి త్యాగం వృధా కాదని, రాబోయేది టిడిపి ప్రభుత్వమేనని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.