సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో పాలన గాడిలో పడిన సంగతి తెలిసిందే. తనకున్న అపార అనుభవంతో చంద్రబాబు గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడను వరద ముంచెత్తితే అధైర్య పడకుండా..కలెక్టరేట్ లోనే మకాం వేసి స్వయంగా వరద నీటిలో దిగి పరిస్థితిని చంద్రబాబు సమీక్షించిన వైనంపై ప్రశంసలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబుపై మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు…తొలిసారి ముఖ్యమంత్రి అయిన రీతిలో కసిగా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నారని లోకేశ్ ప్రశంసించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశం(సీఐఐ)లో పాల్గొన్న లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడం, లక్షలాది ఉద్యోగాలు సృష్టించడం తమ ప్రభుత్వ ఎజెండా అని లోకేశ్ చెప్పారు.
రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్తు వంటి విషయాల గురించే చంద్రబాబు నిత్యం ఆలోచిస్తుంటారని చెప్పారు. పెట్టుబడుల వికేంద్రీకరణతో ఒక్కో జిల్లాకు ఒక్కో రంగంలో పెట్టుబడులు తెస్తున్నామని లోకేశ్ తెలిపారు. ఏఐ టెక్నాలజీ హబ్ గా విశాఖను రూపుదిద్దుతామని, విశాఖ కేంద్రంగా ఐటీ, డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఐఎస్ బీ మోడల్ లో ఏఐ యూనివర్సిటీ స్థాపించాలనుకుంటున్నామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నెల రోజుల్లో ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్టుబడుల కోసం కంపెనీల వద్దకే వస్తామని…ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ చంద్రబాబు నినాదమని తెలిపారు.