ఏపీలో పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసుల అండతో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థుల చేతిలో నుంచి నామినేషన్ పత్రాలను వైసీపీ కార్యకర్తలు లాక్కొని వెళ్లారని, మరికొన్ని చోట్ల రిటర్నింగ్ అధికారులు కూడా టీడీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పక్షపాత ధోరణితో వ్యవహరించే రిటర్నింగ్ అధికారులకు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఇక, కుప్పంలో 14వ వార్డు టీడీపీ అభ్యర్ధిపై వైసీపీ నేతల దాడిని ఖండించిన చంద్రబాబు….జగన్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని మండిపడ్డారు. ఈ ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. అయినా, ఫలితం లేదు. ఈ క్రమంలోనే తాజాగా కుప్పంలో పర్యటిస్తున్న నారా లోకేశ్…జగన్ పై నిప్పులు చెరిగారు. అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతుల పై లాఠీఛార్జ్ ఘటనలను లోకేశ్ ఖండించారు.
పోలీసులు లేకుండా వైసిపి నేతలు బయటకు రాగలరా అని సవాల్ విసిరారు. వైసిపి నేతలు పిరికి వారు, పిల్లులు అంటూ ఫైర్ అయ్యాు. తాను చంద్రబాబులా సాఫ్ట్ కాదని.. వార్నింగ్ ఇచ్చారు. త్వరలో ప్రజా ఉద్యమం రానుందని… అందులో గాలిగాడు జగన్ కొట్టుకుపోతాడని హెచ్చరించారు. దొంగ సంతకాలతో 14వ వార్డు ఏకగ్రీవం చేసుకున్నారని, కుప్పంలో రౌడీలు, స్మగ్లర్ దిగారని మండిపడ్డారు.
‘కుప్పం గడ్డ.. చంద్రన్న అడ్డ’ అని, ఏ గడప తొక్కినా చంద్రన్న ముద్ర ఉంటుందని అన్నారు. గత రెండున్నారేళ్లుగా కుప్పంలో వైసీపీ నేతలు పర్యటించలేదని, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని విమర్శించారు. జగన్ రెడ్డి నోటి నుంచి కుప్పం అనే పదం ఎన్నడూ రాలేదని మండిపడ్డారు. కుప్పం అంటే ఒక పవిత్రమైన దేవాలయమని, ఇక్కడ గొడవలు ఉండవని, ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయని లోకేష్ అన్నారు.