సీఎం జగన్ పాలనపై విసిగివేసారిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు పలుమార్లు తమ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే. తనను ధిక్కరించిన ప్రభుత్వ ఉపాధ్యాయులను జగన్ నానారకాలుగా ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. బయోమెట్రిక్ అంటూ, ఫేస్ రికగ్నిషన్ యాప్ అంటూ టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగులను జగన్ ఇబ్బంది పెడుతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
ఇక, గతంలో వైన్ షాప్ ల వద్ద టీచర్లను విధుల నిర్వహణకు ఉంచడం, మరుగుదొడ్ల పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించడం వంటి వ్యవహారాలు జగన్ పై టీచర్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే, తాజాగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లొకేష్ ను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నాయి.
టీడీపీ హయాంలో ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల పునరుద్ధరణ పదేళ్లకు ఒకసారి జరిగేదని, కానీ జగన్ హయాంలో మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుందని వారు వాపోయారు. ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు అంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై లోకేష్ మండిపడ్డారు. విద్యా వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని లోకేష్ విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులనే కాదు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలను కూడా వైసీపీ నేతలు వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత రెన్యువల్ పద్ధతిని కొనసాగిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇతర కారణాలు సాకుగా చూపుతూ జరుగుతున్న వేధింపులు లేకుండా అడ్డుకట్ట వేస్తామని అన్నారు. అన్ని సమస్యలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.