వైసీపీ నాయకులపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరుగుతూ ప్రసంగించిన వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళతాయని చంద్రబాబు, పవన్ చెప్పారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ప్రజా సమస్యలపై పోరాడటమే తప్పా? అని లోకేశ్ ప్రశ్నించారు.
మహిళలను అగౌరవపరిచిన వైసీపీ నేతలపై జగన్ చర్యలు తీసుకోలేదని, నవ్వుతూ ఎంజాయ్ చేశారని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ప్రజా సమస్యలపై పోరాడతాయని అన్నారు. విశాఖలో ఎంపీ ఎంవీవీ, ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య వాటాల్లో తేడా వచ్చిందని, అందుకే దసపల్లా వంటి భూ కుంభకోణాలు బయటపెట్టుకున్నారని ఆరోపించారు. దసపల్లా భూములపై సీబీఐ ఎంక్వయిరీ వేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? అని లోకేశ్ ప్రశ్నించారు.
జగన్ కోరిక, డిమాండ్ల ప్రకారమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని, కానీ, ఇప్పుడు కరకట్ట కమల్ మాట తప్పి, మడమ తిప్పాడని ఎద్దేవా చేశారు. ప్రజలకు జగన్ ద్రోహం చేస్తున్నారని, అభివృద్ది చేతగాక మూడు రాజధానులంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఓ వైసీపీ ఎంపీ అమరావతి రైతులకు చెప్పు చూపించి దాడి చేయించాడని, ఆ ఎంపీకి ఒళ్లు బలిసిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడి చెయ్యాలి అనుకుంటే నాడు చంద్రబాబు గారిపై మాట్లాడిన మాటలకు జగన్ హైదరాబాద్ నుండి ఆంధ్రాలో అడుగు పెట్టేవాడా? పాదయాత్ర చెయ్యగలిగేవాడా? అని లోకేశ్ నిలదీశారు. రైతులను అవమానించిన వారికి శాపం తగలడం ఖాయమని అన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమిపాలైనా ప్రజల్లోనే ఉన్నానని, నియోజకవర్గంలో 12 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండి ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నానని, అధికారంలో ఉంటే ఇంకెంత అభివృద్ధి చేస్తానో ప్రజలు ఆలోచించాలని లోకేశ్ అన్నారు. రెండుసార్లు గెలిచిన ఆర్కే ఇక్కడ ఏమీ చేయలేదని మండిపడ్డారు.